టెన్నిస్‌లో పురుషులకే ఎక్కువసార్లు శిక్ష

17 Sep, 2018 05:57 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌: టెన్నిస్‌ క్రీడలో ఇప్పటిదాకా మహిళల కంటే పురుషులకే ఎక్కువ శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఓ నివేదికలో తేలింది. గ్రాం డ్‌స్లామ్‌ టోర్నీల్లో గత 20 ఏళ్లలో ఆటగాళ్లకు 1517 సార్లు జరిమానాలు విధిస్తే... క్రీడాకారిణిలకు కేవలం 535 సార్లు మాత్రమే జరిమానాలు విధించినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. 1998 నుంచి 2018 వరకు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లను పరిశీలించగా 3 రెట్లు అధికంగా పురుషులకే శిక్షలు పడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. ఆటగాళ్లు, క్రీడాకారిణిలు అసహనంతో చేసిన తప్పిదాలకు ఎవరెన్నిసార్లు శిక్షలకు గురయ్యారనే లెక్కలు కూడా ఉన్నాయి. కోర్టులో రాకెట్లను బద్దలు కొట్టిన సందర్భంలో పురుషులు 649 సార్లు, మహిళలు 99 సార్లు పాయింట్ల కోతకు గురయ్యారు.

అనుచితంగా నోరు పారేసుకున్న ఘటనల్లో పురుషులు 344 సార్లు, మహిళలు 140 సార్లు, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించిన ఘటనల్లో పురుషులు 287 సార్లు, మహిళలు 67 సార్లు శిక్షకు గురయ్యారు. గత వారం యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్‌)తో మ్యాచ్‌ సందర్భంగా సెరెనా విలియమ్స్‌ ఒక్కసారిగా సహనం కోల్పో యిన సంగతి తెలిసిందే. చైర్‌ అంపైర్‌ను దూషించడంతో ఆయన అంతే తీవ్రంగా స్పందించి ఆమెకు పాయింట్ల కోత పెట్టారు. పురుషులు ఇలా చేస్తే అలాగే శిక్షించేవారా అని ఆమె గద్దించింది. సమానత్వం కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. సెరెనా నోరు పారేసుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. 2009లో లైన్‌ విమెన్‌పై విరుచుకుపడింది. ఈ ఏడాది ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో మీడియా సమావేశంలో ఓ విలేకరిపై అసహనం ప్రదర్శించింది. 

మరిన్ని వార్తలు