బీసీసీఐ-పీసీబీలకు సీఎం మమత ఆహ్వానం!

19 Oct, 2015 18:10 IST|Sakshi
బీసీసీఐ-పీసీబీలకు సీఎం మమత ఆహ్వానం!

కోల్ కతా:  డిసెంబర్ లో యూఏఈలో  టీమిండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో చర్చలను తమ రాష్ట్రంలో జరుపుకోవచ్చంటూ భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. మరో రెండు నెలల్లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ అంశంపై పాకిస్థాన్ తో క్రికెట్ బోర్డుతో చర్చలకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడంతో సోమవారం ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో చర్చలకు ఆయా బోర్డులకు విఘాతం కలిగితే..  కోల్ కతా నగరంలో భేటి కావొచ్చంటూ ఇరు క్రికెట్ బోర్డు పెద్దలకు మమత ట్విట్టర్ ద్వారా ఆహ్వనం పలికారు.

ఈ రోజు ఉదయం ఇండో - పాక్‌ సిరీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ  కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రెసిడెంట్‌ శశాంక్‌ మనోహర్‌ ఛాంబర్‌లోకి చొరబడిన శివసేన కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగి సిరీస్ పై చర్చలు వద్దంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా ఇరు క్రికెట్ బోర్డుల మధ్య జరగాల్సిన సమావేశం తాత్కాలికంగా రద్దయ్యింది. ఇరుదేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఆరు సిరీస్ లు జరగాల్సి ఉంది. 2007 తరువాత ఓ సిరీస్ లో భాగంగా 2012-13 వ సంవత్సరంలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. 

మరిన్ని వార్తలు