కోహ్లి కంటే ముందుగానే..

7 Nov, 2019 14:26 IST|Sakshi

ఆంటిగ్వా:  భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతీ మంధాన ఖాతాలో మరో ఘనత చేరింది. వన్డేల్లో రెండు వేల పరుగుల మార్కును మంధాన చేరుకున్నారు. వెస్టిండీస్‌తో మూడు వన్టేల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో ఆడిన మంధాన 63 బంతుల్లో 74 పరుగులు చేశారు. ఈ క‍్రమంలోనే వన్డే ఫార్మాట్‌లో రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మంధాన 2,025 వన్డే పరుగులతో ఉన్నారు. అయితే వేగవంతంగా రెండు వేల పరుగుల్ని సాధించిన రెండో భారత క్రికెటర్‌గా మంధాన ఘనత సాధించారు. 51 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు వేల పరుగులు సాధించడంతో శిఖర్‌ ధావన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించారు.

శిఖర్‌ ధావన్‌ రెండు వేల వన్డే పరుగుల్ని చేరే క్రమంలో 48 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకోగా, మంధాన రెండో స్థానంలో నిలిచారు. కాగా, భారత పురుష క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లి కంటే కూడా మంధాన రెండు వేల పరుగుల్ని ముందుగా సాధించడం ఇక్కడ విశేషం.  కోహ్లి 53వ ఇన్నింగ్స్‌లో 2వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఇక భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 52వ ఇన్నింగ్స్‌లో రెండు వేల పరుగుల మార్కును చేరారు.

ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మంధాన 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందడమే కాకుండా సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను భారత మహిళలు 42.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు.  రోడ్రిగ్స్‌(69) హాఫ్‌ సెంచరీ సాధించారు.

మరిన్ని వార్తలు