క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో

12 Dec, 2018 13:49 IST|Sakshi
రెక్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన అరుణాచల్‌ బ్యాట్స్‌మన్‌ రెక్స్‌ రాజ్‌కుమార్‌ సింగ్‌

10 వికెట్లు తీసిన మణిపురి అండర్‌ 19 కుర్రాడు

కుచ్‌బిహార్‌ ట్రోఫీ విజేత మణిపురి జట్టు  

సాక్షి, అనంతపురం : క్రికెట్‌లో సంచలనం నమోదైంది. మణిపూర్‌ అండర్‌ 19 బౌలర్‌ రెక్స్‌ రాజ్‌కుమార్‌ సింగ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన కుచ్‌ బిహార్‌ ట్రోఫీలో ఈ అద్భుత రికార్డు నమోదైంది. మణిపురి-అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెక్స్‌ రాజ్‌కుమార్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్సింగ్స్‌లో 9.5 ఓవర్లు వేసిన రేక్స్‌.. 11 పరుగులు ఇచ్చి, 10 వికెట్లు తీసాడు. ఇందులో 6 ఓవర్లు మెయిడిన్‌ కావడం విశేషం. ఈ దెబ్బకు మణిపురి ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగు రోజులు జరగాల్సిన మ్యాచ్‌ ఒకటిన్నర రోజుతోనే ముగిసిపోయింది.

మొత్తం ఈ మ్యాచ్‌లో రెక్స్‌ 15 వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు. మణిపురి జట్టు 3 వికెట్లకు 89 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా, 49.1 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులో అభిజిత్‌ 48 పరుగులు సాధించాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టు బౌలర్లలో గోవింద్‌మిట్టల్‌ 5,  బాగ్రా 4 వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 18.5 ఓవర్లలో 36 పరుగులకు కుప్పకూలింది.  52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపురి జట్టు 7.5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 55 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. జట్టులో శుభం చౌహాన్‌ 32(25 బంతులు), జాన్సన్‌ 23(22 బంతులు) సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ట్రోఫీలను అందించారు.

అనంత క్రీడాకారుడి రికార్డు సమం
2009–10లో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కుచ్‌ బిహార్‌ ట్రోఫీ మ్యాచ్‌లో త్రిపుర జట్టుతో తలపడిన ఆంధ్ర అండర్‌–19 జట్టు  మ్యాచ్‌లో  అనంత క్రీడాకారుడు మహబూబ్‌ బాషా ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించాడు. ఈ రికార్డును రెక్స్‌ రాజ్‌కుమార్‌సింగ్‌  సమం చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు