మనీశ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌ టైటిల్స్‌

1 Jul, 2019 13:55 IST|Sakshi

జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మనీశ్‌ కుమార్‌ సత్తా చాటాడు. యూసుఫ్‌గూడలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల, అండర్‌–19 బాలుర సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచిన మనీశ్‌... అండర్‌–19 బాలుర డబుల్స్‌లో తన భాగస్వామి బి. నిఖిల్‌ రాజ్‌తో కలిసి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మనీశ్‌ కుమార్‌ 19–21, 21–12, 21–14తో తరుణ్‌ రెడ్డిపై గెలుపొందగా, మహిళల సింగిల్స్‌ తుదిపోరులో కైవల్య లక్ష్మి 21–15, 21–12తో పూర్వీ సింగ్‌ సుచిత్రను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

డబుల్స్‌ విభాగంలో అబ్దుల్‌ రెహాన్‌–ఆదిత్య గుప్తా, పూర్వీ సింగ్‌ సుచిత్ర–ప్రణాళి జంటలు విజేతలుగా నిలిచాయి. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అబ్దుల్‌ రెహాన్‌–ఆదిత్య గుప్తా జంట 21–14, 21–18తో గోపీకృష్ణ–సందీప్‌ జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో పూర్వీ సింగ్‌ సుచిత్ర–ప్రణాళి జంటకు ప్రత్యర్థి జోడీ క్రాంతి–మౌన్యశ్రీ నుంచి వాకోవర్‌ లభించడంతో విజేతగా నిర్ణయించారు. అండర్‌–19 బాలుర సింగిల్స్‌ ఫైనల్లో మనీశ్‌ కుమార్‌ 21–14, 21–16తో తరుణ్‌ రెడ్డిపై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్‌లో తరుణ్‌ 21–12, 21–16తో తారక్‌పై, మనీశ్‌ 21–10, 18–21, 21–10తో పృథ్వీపై గెలిచారు.

అండర్‌–19 బాలుర డబుల్స్‌ తుది పోరులో మనీశ్‌–నిఖిల్‌ రాజ్‌ ద్వయం 21–15, 21–15తో పృథ్వీ–వర్షిత్‌ రెడ్డి జోడీపై విజయం సాధించింది. అండర్‌–17 సింగిల్స్‌లో ధరణ్, డబుల్స్‌లో ఉనీత్‌ కృష్ణ–వర్షిత్‌ రెడ్డి జంట చాంపియన్‌లుగా నిలిచాయి. అండర్‌–17 బాలుర ఫైనల్లో ధరణ్‌ 21–16తో ఆధిక్యంలో ఉన్న సమయంలో శశాంక్‌ సాయి గాయంతో వైదొలిగాడు. డబుల్స్‌ తుదిపోరులో ఉనీత్‌ కృష్ణ–వర్షిత్‌ రెడ్డి జంట 21–19, 21–15తో నిఖిల్‌ రాజ్‌–తారక్‌ జోడీని ఓడించి టైటిల్‌ను అందుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షులు నాగవాణి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు