మనీష్‌ పాండే డబుల్‌ హ్యాట్రిక్‌

1 Feb, 2020 11:38 IST|Sakshi

వెల్లింగ్టన్‌: టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20 టీమిండియా వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో పాండే ఆదుకున్నాడు. ఆద్యంతం సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అజేయంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కేవలం మూడు ఫోర్లు మాత్రమే కొట్టిన మనీష్‌..  స్టైక్‌ను రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోరు బోర్డును చక్కదిద్దాడు. మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌తోనే భారత్‌ జట్టు 165 పరుగుల స్కోరును బోర్డుపై ఉంచకల్గింది. ఇది గౌరవప్రదమైన స్కోరు కావడంతో టీమిండియా కడవరకూ పోరాడటానికి వీలు దొరికింది. (ఇక్కడ చదవండి: ‘సూపర్‌’ సీక్వెల్‌)

మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకూ వెళ్లిందంటే అందుకు మనీష్‌ పాండే ఇన్నింగ్సే ప్రధానం కారణం. అయితే మనీష్‌ పాండే తన నాటౌట్‌ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ ఔట్‌ కానీ మనీష్‌ పాండే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచి ‘డబుల్‌ హ్యాట్రిక్‌’ కొట్టాడు. గత ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మనీష్‌ పాండే  (50 నాటౌట్‌, 14 నాటౌట్‌, 14 నాటౌట్‌, 31 నాటౌట్‌, 22 నాటౌట్‌, 2 నాటౌట్‌) అజేయ యాత్రను కొనసాగించాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 46.40 యావరేజ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లి, బాబర్‌ అజామ్‌ల తర్వాత అత్యుత్తమ యావరేజ్‌ మనీష్‌ పాండేదే కావడం విశేషం. 2019 ఆగస్టు 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ భారత్‌కు మనీష్‌ పాండే 9 సార్లు ప్రాతినిధ్యం వహించగా అందులో ఆరుసార్లు అజేయంగా ఉండటం మరొక విశేషం. అయితే ఈ సమయంలో మనీష్‌ పాండే ఆడిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. 

మరిన్ని వార్తలు