వెయిటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ..

26 Aug, 2016 16:35 IST|Sakshi
వెయిటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ..

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్లో భారత్ సాధించిన పతకాలు రెండు. ఒకరు రజత పతక విజేత పీవీ సింధు అయితే, మరొకరు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ రెండు పతకాలు భారత పరువును నిలబెట్టగా, తృటిలో పతకాన్ని కోల్పోయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా భారతీయుల మనసుల్ని గెలుచుకుంది. అయితే రియో రేస్ వాకింగ్లో ఆకట్టుకున్న భారత అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ ప్రదర్శనను కూడా ఏమాత్రం తక్కువ అనలేం.


రేస్ వాకింగ్  ఫైనల్లో భాగంగా 20 కిలో మీటర్ల వాకింగ్ ను ఒక గంటా 20 నిమిషాల 21 సెకెండ్లలో పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. కాగా, ఇది కాంస్య పతకం సాధించే క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నమోదు చేసిన సమయం కంటే నిమిషం తక్కువ. దీంతో  పతకం సాధించాలనుకున్న మనీష్ ఆశలను ఆ నిమిషం మింగేసింది.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్  గ్రామానికి మనీష్ సింగ్ రావత్.. పేదరికంలోనే పుట్టాడు. దీనికి తోడు మనీష్ తండ్రి కూడా చిన్నతనంలోనే చనిపోవడంతో అతని కష్టాలకు అధికమయ్యాయి. దాంతో కుటుంబాన్ని పోషించడానికి వెయిటర్ అవతారం ఎత్తాడు. బద్రినాథ్లోని కృష్ణ హోటల్ వెయిటర్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అయితే అతని చిన్ననాటి కల మాత్రం రేస్ వాకర్గా సత్తాచాటాలనే. తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెల్లవారుజామునే నిద్రలేచి  బద్రీనాథ్ రోడ్లపై ప్రాక్టీస్ చేసేవాడు. ఆ క్రమంలో అతని రేస్ వాక్ను చూసి రోడ్డుపై చాలా మంది నవ్వుకునే వారు. కానీ వాటిని ఏమీ లెక్క చేసేవాడు కాడు. వాకింగ్ చేయడంతో పాటు, వెయిటర్ గా డ్యూటీ చేయడమే తనకు తెలిసిన పనులు. అలా రేస్ వాక్ ను ప్రారంభించిన మనీష్ జాతీయ అథ్లెట్గా ఎదిగాడు. అనంతరం గతేడాది బీజింగ్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ అథ్లెటిక్స్లో సత్తా చాటుకుని రియోకు అర్హత సాధించాడు. ఒక వెయిటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియో ఒలింపిక్స్ వరకూ వెళ్లిన మనీష్  జీవితం అందరికీ ఆదర్శమే కదా.

మరిన్ని వార్తలు