ఢిల్లీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లపై నిషేధం

13 Mar, 2020 13:29 IST|Sakshi

ఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించిన  మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేర్కొంది.ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా శుక్రవారం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ' ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉంది. దాంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిషేధిస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను కూడా అనుమతించేది లేదు. ఒకవేళ బీసీసీఐ కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్‌లో నిర్వహించాలనుకుంటే అది వారి ఇష్టం' అని పేర్కొన్నారు. (భయంతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోని కెప్టెన్లు)

మరోవైపు  ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించాలా ? వద్దా? అనే దానిపై సందిగ్థత నెలకొనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించలేమని కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. ఇదే విషయమై శనివారం(మార్చి 14) ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

>
మరిన్ని వార్తలు