ఐపీఎల్‌ వేలంపై మనోజ్‌ తివారీ అసహనం!

19 Dec, 2018 12:14 IST|Sakshi
మరోజ్‌ తివారీ

జైపూర్‌ : ఐపీఎల్‌ తాజా వేలంపై భారత క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అసహనం వ్యక్తం చేశాడు. 2019 సీజన్‌ కోసం మంగళవారం జరిగిన వేలంలో ఏ ఫ్రాంచైజీ తివారీని కనుకరించలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. దీంతో అతను ఈ సీజన్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీనిపై మనోజ్‌ తివారీ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

‘నా జీవితంలో అసలేం జరుగుతుందో.. దేశం తరపున సెంచరీ చేసి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అందుకున్న తరువాత కూడా 14 మ్యాచ్‌ల వరకు అవకాశం రాలేదు. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో ఇన్ని అవార్డులు గెలుచుకున్నా(అవార్డుల ఫొటోను ఉద్దేశిస్తూ) కూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

తివారీ గత సీజన్‌లో విఫలమైనప్పటికీ 2017లో రైజింగ్‌ పుణె తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌ల్లో 32.4 సగటుతో 324 పరుగులు చేశాడు. కానీ గత సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున 5 మ్యాచ్‌ల్లో 37 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతే కాకుండా ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌పై బెంగాల్‌ తరుఫున డబుల్‌ సెంచరీ కూడా సాధించాడు. అయినా అవకాశం దక్కపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 2011 సీజన్‌లో కోల్‌కతా టైటిల్‌ నెగ్గడంలో తివారీ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 359 పరుగులు చేశాడు. సీజన్‌ ప్రారంభమయ్యేలోపు ఏ ఫ్రాంచైజీ అన్న కరుణిస్తదో లేదో చూడాలి!

మరిన్ని వార్తలు