క్యాష్‌ ప్రైజ్‌ అంతా ఉత్తిదేనా?: అథ్లెట్‌ ఆవేదన

4 Jan, 2019 19:49 IST|Sakshi

చంఢీగడ్‌:  క్రీడాకారులు పథకాలు సాధిస్తే వారిపై వరాల జల్లులు కురిపించడం ప్రభుత్వ పెద్దలకు చాలా సాధారణ విషయం. ఇక గెలిచిన హడావుడి అయిపోయిన తర్వాత ఆ క్రీడాకారులను పట్టించుకోని సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి అనుభవమే భారత యువ షూటర్‌ మను బాకర్‌కు ఎదుర్కొంటోంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడితో పాటు యూత్‌ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించినప్పుడు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అక్టోబర్‌లో జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో మను బాకర్‌ స్వర్ణ పతాకం గెలిచారు. దీంతో హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ మను బాకర్‌కు రెండు కోట్ల నజరానాను ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు.

అంతేకాకుండా గత ప్రభుత్వాలు క్రీడాకారులను పట్టించుకోలేదని.. పతకాలు సాధిస్తే కేవలం పది లక్షలు మాత్రమే ఇచ్చి సంతృప్తి పరిచేవారని కానీ తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రొత్సహించే ఉద్దేశంతో మను బాకర్‌కు రెండు కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ తనకు ఎలాంటి అర్థిక సహాయం అందలేదని.. ‘మంత్రి గారు మీరు ప్రకటించిన నజరానా నిజమా.. లేక ఉత్తిదేనా’ అంటూ శుక్రవారం మనుబాకర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా గతంలో మంత్రి చేసిన ట్వీట్‌కు సంబంధించన స్క్రీన్‌ షాట్‌లు కూడా పోస్ట్‌ చేశారు. ఇక ఈ యువ షూటర్‌ చేసిన పోస్ట్‌ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారాయి. ప్రభుత్వ తీరుపై క్రీడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు