సుమీత్‌–మనూ జంట సంచలనం

13 Sep, 2018 01:08 IST|Sakshi

రియో ఒలింపిక్స్‌ రజత పతక జోడీపై విజయం

జపాన్‌ ఓపెన్‌ టోర్నీ

టోక్యో: భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జంట సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌–మనూ అత్రి ద్వయం 15–21, 23–21, 21–19తో ప్రపంచ 10వ ర్యాంక్, రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన గో వీ షెమ్‌–తాన్‌ వీక్‌ కియోంగ్‌ (మలేసియా) జంటను బోల్తా కొట్టించింది. 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ రెండో గేమ్‌లో భారత జోడీ మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకోవడం విశేషం. అంతేకాకుండా నిర్ణాయక మూడో గేమ్‌లో 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ‘ఈ మధ్య మేమిద్దరం బాగా ఆడుతున్నాం. కీలకదశలో సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నాం.  సమన్వయ లోపం లేకుండా చూసుకుంటున్నాం. ఆసియా క్రీడల్లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో చైనా జోడీతో జరిగిన మ్యాచ్‌లో మేము 3 మ్యాచ్‌ పాయింట్లు కోల్పో యాం. ఆ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కచ్చితంగా మాకు పతకం సాధించే అవకావకాశాలు ఉండేవి. ఏదేమైనా ఆ ఓటమితో మేము గుణపాఠం నేర్చుకున్నాం’ అని మనూ అత్రి అన్నాడు.  

మరో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 12–21, 17–21తో మూడో సీడ్‌ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జోడీ 17–21, 13–21తో చాంగ్‌ యె నా–జంగ్‌ క్యుంగ్‌ యున్‌ (దక్షిణ కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. 
నేడు జరిగే మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గావో ఫాంగ్‌జి (చైనా)తో పీవీ సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0–1తో వెనుకబడి ఉంది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో విన్సెంట్‌ (హాంకాంగ్‌) తో శ్రీకాంత్‌; జిన్‌టింగ్‌ ఆంథోనీ (ఇండోనేసియా)తో ప్రణయ్‌ ఆడతారు. డబుల్స్‌లో హీ జిటియాంగ్‌–తాన్‌ కియాంగ్‌ (చైనా)లతో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి; చాన్‌ పెంగ్‌ సూన్‌–గో లియు యింగ్‌ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా తలపడతారు. ఇటీవల ఆసియా క్రీడల్లో విన్సెంట్‌ చేతిలో ఓడిపోయిన శ్రీకాంత్‌ ఈసారి గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలతో ఉన్నాడు.  

నేటి ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌ 
ఉదయం గం. 7.00 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం   

మరిన్ని వార్తలు