లార్డ్స్‌ టెస్ట్‌: అంపైర్‌ ఆఫ్‌ సెంచరీ!

10 Aug, 2018 16:49 IST|Sakshi
మైరస్‌ ఎరాస్ముస్‌

లార్డ్స్‌ : అదేంటీ అంపైర్‌ ఆఫ్‌ సెంచరీ అనుకుంటున్నారా? ఆటగాళ్లకే హాఫ్‌ సెంచరీలుంటాయా? అంపైర్లకు ఉండవా? భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌లో అంపైర్‌ మరైస్‌ ఎరాస్ముస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్‌ టెస్టు అతనికి కెరీర్‌లో అంపైర్‌గా 50వ టెస్ట్‌. దీంతో ఈ ఘనతను అందుకున్న 17వ అంపైర్‌గా, రెండో దక్షిణాఫ్రికా అంపైర్‌గా మరైస్‌ ఎరాస్ముస్‌ నిలిచాడు. అతని కన్నా ముందు రూడీ కోర్ట్‌జెన్‌ సఫారీ నుంచి ఈ ఘనతను అందుకున్నాడు. అతను 108 టెస్టులకు అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ జాబితాలో స్టీవ్‌బక్‌నర్‌ 128 టెస్టులతో తొలి స్థానంలో ఉన్నాడు.

2010లో బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఎరాస్ముస్‌ తొలిసారి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. 2016,2017లో ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా డేవిడ్‌ షేపహర్డ్‌ ట్రోఫీలందుకున్నాడు. అంపైర్‌ కాకముందు ఎరాస్ముస్‌ 53 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడి 1913 పరుగులతో 131 వికెట్లు పడగొట్టాడు.

తన జీవితంలో మరిచిపోలేని రోజని, ఈ ఘనతను అందుకున్న17వ అంపైర్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. తన విజయానికి తన కుంటు సభ్యులే కారణమని, తనకు మద్దతుగా నిలిచిన ఐసీసీ, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఐసీసీ సైతం ఎరాస్ముస్‌ను అభినందిస్తూ అతని సేవలను కొనియాడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్‌-భారత్‌ టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్‌ నిలిచే సమయానికి భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది.

చదవండి: 10 పరుగులకే ఓపెనర్లు ప్యాకప్‌!

మరిన్ని వార్తలు