అయ్యో షరపోవా!

22 Jan, 2020 03:19 IST|Sakshi

వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ

కెరీర్‌లో ఇలా జరగడం తొలిసారి

టాప్‌ సీడ్‌ నాదల్‌ శుభారంభం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

పూర్వ వైభవం కోసం తపిస్తున్న రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా కెరీర్‌ మళ్లీ గాడిన పడే అవకాశం కనిపించడంలేదు. ఆమె ప్రస్తుత ర్యాంక్‌ ప్రకారమైతే నేరుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం లేకపోయినా... గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ రూపంలో నేరుగా ఆడే అవకాశం ఇచ్చారు. కానీ ఈ మాజీ చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.

గతేడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన 32 ఏళ్ల షరపోవా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లోనూ మొదటి రౌండ్‌ను దాటలేకపోయింది. ఫలితంగా కెరీర్‌లో తొలిసారి వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయి భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకునే రోజు సమీపంలోనే ఉందని సంకేతాలు పంపించింది.  

మెల్‌బోర్న్‌: పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన రష్యా స్టార్‌ మరియా షరపోవా కెరీర్‌ తిరోగమనంలో పయనిస్తోంది. ‘వైల్డ్‌ కార్డు’తో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అడుగుపెట్టిన షరపోవా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ 20వ ర్యాంకర్‌ డోనా వెకిచ్‌ (క్రొయే షియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 145వ ర్యాంకర్‌ షరపోవా 3–6, 4–6తో ఓడిపోయింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. 2008 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, 2007, 2012, 2015 రన్నరప్‌ అయిన షరపోవా తన సర్వీస్ ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. గతేడాది ఈ టోరీ్నలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన షరపోవా ఈసారి తొలి రౌండ్‌లోనే వెనుదిరగడంతో ఫిబ్రవరి 3న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె 350వ స్థానానికి పడిపోయే అవకాశముంది.   

రెండో రౌండ్‌లో ప్లిస్కోవా...
మహిళల సింగిల్స్‌ ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఆరో సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌), తొమ్మిదో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌), పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), మాజీ చాంపియన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 12వ సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌) మాత్రం తొలి రౌండ్‌లో ఓడింది. ప్లిస్కోవా 6–1, 7–5తో మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)పై, హలెప్‌ 7–6, (7/5), 6–1తో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)పై, స్వితోలినా 6–4, 7–5తో కేటీ బుల్టర్‌ (బ్రిటన్‌)పై, బెన్సిచ్‌ 6–3, 7–5తో ష్మెద్లోవా (స్లొవేకియా)పై, కికి బెర్‌టెన్స్‌ 6–1, 6–4తో ఇరీనా బేగూ (రొమేనియా)పై, కీస్‌ 6–3, 6–1తో కసత్‌కినా (రష్యా)పై, కెర్బర్‌ 6–2, 6–2తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచారు.  కొంటా 4–6, 2–6తో ఆన్స్‌ జెబెయుర్‌ (ట్యూనిíÙయా) చేతిలో ఓటమి పాలైంది.  

మెద్వదేవ్, థీమ్‌ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6–2, 6–3, 6–0తో డెలియన్‌ (బొలీవియా)పై అలవోకగా నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–3, 4–6, 6–4, 6–2తో టియాఫో (అమెరికా)పై, ఐదో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–3, 7–5, 6–2తో మనారినో (ఫ్రాన్స్‌)పై, ఏడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 7–6 (7/4), 6–3తో సెచినాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. 15వ సీడ్, 2014 చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), పదో సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌), 11వ సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం), 12వ సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.  

ప్రజ్నేశ్‌కు నిరాశ
‘లక్కీ లూజర్‌’గా మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనూ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. ప్రపంచ 144వ ర్యాంకర్‌ తత్సుమ ఇటో (జపాన్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 122వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 4–6, 2–6, 5–7తో ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్‌లో ఓడిన ప్రజ్నేశ్‌కు 90 వేల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 43 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

>
మరిన్ని వార్తలు