షరపోవా జోరు

3 Sep, 2017 01:38 IST|Sakshi
షరపోవా జోరు

ప్రిక్వార్టర్స్‌లోకి రష్యా స్టార్‌
ప్లిస్కోవా, ముగురుజా కూడా
♦  యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ


న్యూయార్క్‌: డోపింగ్‌ నిషేధం గడువు ముగిశాక బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో రష్యా స్టార్‌ మరియా షరపోవా హడలెత్తిస్తోంది. తొలి రెండు రౌండ్‌లలో మూడు సెట్‌లలో గట్టెక్కిన ఈ మాజీ చాంపియన్‌... మూడో రౌండ్‌లో మాత్రం వరుస సెట్‌లలో విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో షరపోవా 7–5, 6–2తో సోఫియా కెనిన్‌ (అమెరికా)పై గెలిచింది. 2011 యూఎస్‌ ఓపెన్‌ నుంచి ఇప్పటివరకు 15 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో బరిలోకి దిగిన షరపోవా 14 సార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకోవడం విశేషం. సోఫియాతో గంటా 42 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో షరపోవా ఎనిమిది ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 38 విన్నర్స్‌ కొట్టిన ఈ మాజీ విజేత 33 అనవసర తప్పిదాలు చేసింది.  మరోవైపు మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌), తొమ్మిదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), 16వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో రౌండ్‌లో వీనస్‌ 6–3, 6–4తో మరియా సకారి (గ్రీస్‌)పై, ముగురుజా 6–1, 6–1తో రిబరికోవా (స్లొవేకియా)పై, సెవస్తోవా 6–2, 6–2తో డోనా వెకిక్‌ (క్రొయేషియా)పై గెలిచారు.

ఐదో సీడ్‌ సిలిచ్‌కు షాక్‌
పురుషుల సింగిల్స్‌ విభాగంలో రెండు సంచలనాలు నమోదయ్యాయి. 2014 చాంపియన్, ఐదో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), పదో సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు. 29వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) 4–6, 7–5, 7–5, 6–4తో సిలిచ్‌పై... 23వ సీడ్‌ మిషా జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–3, 7–6 (7/5)తో జాన్‌ ఇస్నెర్‌పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.  

షపోవలోవ్‌ దూకుడు...
కెనడా రైజింగ్‌ స్టార్, 18 ఏళ్ల డెనిస్‌ షపోవలోవ్‌ 3–6, 6–3, 6–3, 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి ఎడ్మండ్‌ (బ్రిటన్‌) గాయం కారణంగా వైదొలగడంతో షపోవలోవ్‌ను విజేతగా ప్రకటించారు. 1989లో మైకేల్‌ చాంగ్‌ (17 ఏళ్లు) తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన రెండో పిన్న వయస్కుడిగా క్వాలిఫయర్‌ షపోవలోవ్‌ గుర్తింపు పొందాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 12వ సీడ్‌ పాబ్లో బుస్టా (స్పెయిన్‌)తో షపోవలోవ్‌ ఆడతాడు. గత 3 మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ కూడా కోల్పోని బుస్టా 1967 తర్వాత ఓ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ క్వాలిఫయర్‌ను ఎదుర్కోనున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందనున్నాడు. మరోవైపు 35 ఏళ్ల ప్రాయంలో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గా లొరెంజీ (ఇటలీ) రికార్డు నెలకొల్పాడు. మూడో రౌండ్‌లో లొరెంజీ 6–2, 6–4, 6–4తో ఫాబియానోపై గెలిచాడు.

ఓటమి అంచుల నుంచి...
మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) అతికష్టమ్మీద ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. షుయె జాంగ్‌ (చైనా)తో జరిగిన మూడో రౌండ్‌లో ప్లిస్కోవా 3–6, 7–5, 6–4తో గెలిచింది. తొలి సెట్‌ కోల్పోయి, రెండో సెట్‌లో స్కోరు 4–5 వద్ద జాంగ్‌ సర్వీస్‌లో మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకున్న ప్లిస్కోవా స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి జాంగ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్న ప్లిస్కోవా పట్టుదలతో పోరాడి గట్టెక్కింది.

మరిన్ని వార్తలు