గ్లామర్ భామలు బోల్తా

27 Jun, 2013 10:07 IST|Sakshi
గ్లామర్ భామలు బోల్తా

లండన్: మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ అనూహ్య ఓటమితో వింబుల్డన్ టోర్నమెంట్‌లో తొలి రోజు నుంచే మొదలైన సంచలనాలు మూడో రోజూ కొనసాగాయి. అందంతోనూ, ఆటతోనూ అలరించే రష్యా భామ షరపోవా... సెర్బియా బ్యూటీ ఇవనోవిచ్... డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి నిరాశజనక ఆటతీరుతో రెండో రౌండ్‌లోనే చేతులెత్తేశారు.
 
 గాయాల కారణంగా రెండో సీడ్ అజరెంకా (బెలారస్)... పదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)... అన్‌సీడెడ్ ష్వెదోవా (కజకిస్థాన్)... తొలి రౌండ్‌లో నాదల్‌ను మట్టికరిపించిన అన్‌సీడెడ్ స్టీవ్ డార్సిస్ (బెల్జియం) బరిలో దిగకుండానే తమ ప్రత్యర్థులకు ‘వాకోవర్’ ఇచ్చారు. ఆరో సీడ్ సోంగా (ఫ్రాన్స్), 18వ సీడ్ ఇస్నెర్ (అమెరికా), స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)...  డబుల్స్ జోడి టామిక్ (ఆస్ట్రేలియా)-ట్రయెస్కీ (సెర్బియా) మాత్రం గాయాల కారణంగా మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగారు. ఫలితంగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో తొలిసారి ఒకేరోజు ఏకంగా తొమ్మిది మంది క్రీడాకారులు తప్పుకున్నారు.
 
 మిచెల్లి, బౌచర్డ్ సంచలనం: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన మూడో సీడ్ షరపోవాకు రెండో రౌండ్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. ప్రపంచ 131వ ర్యాంకర్ మిచెల్లి లార్చర్ డి బ్రిటో (పోర్చుగల్) ఆద్యంతం స్థిరమైన ఆటతీరును కనబరిచి 6-3, 6-4తో 2004 చాంపియన్ షరపోవాను ఇంటిదారి పట్టించింది. కోర్టులో మూడుసార్లు జారిపడిన షరపోవా ఏదశలోనూ పుంజుకున్నట్లు కనిపించలేదు.
 
  రెండో సెట్‌లో నాలుగుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకొని తేరుకునే ప్రయత్నం చేసినా మిచెల్లి కీలకమైన దశలో పైచేయి సాధించి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో 2012 జూనియర్ బాలికల చాంపియన్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 6-3, 6-3తో 12వ సీడ్ అనా ఇవనోవిచ్‌ను ఓడించగా... ప్రపంచ 196వ ర్యాంకర్ పెట్రా సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-2తో తొమ్మిదో సీడ్ వొజ్నియాకిపై గెలిచింది. మోకాలి గాయంతో రెండో సీడ్ అజరెంకా తన ప్రత్యర్థి ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)కి వాకోవర్ ఇచ్చింది. మొత్తానికి మహిళల విభాగంలో ఒకేరోజు నలుగురు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు (షరపోవా, ఇవనోవిచ్, వొజ్నియాకి, అజరెంకా) నిష్ర్కమించారు.
 
 మూడో రౌండ్‌లో ఆండీ ముర్రే: పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ముర్రే 6-3, 6-3, 7-5తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. అన్‌సీడెడ్ గుల్బిస్ (లాత్వియా)తో జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ సోంగా స్కోరు 6-3, 3-6, 3-6తో ఉన్నదశలో మోకాలి గాయంతో తప్పుకున్నాడు. మరో మ్యాచ్‌లో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ) 6-4, 6-4, 6-7 (3/7), 6-2తో 2002 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.  
 
 కోర్టు బాగాలేదు: అజరెంకా
 సోమవారం తాను ఆడిన నంబర్-1 కోర్టు నాణ్యత బాగాలేదని రెండో సీడ్ అజ రెంకా విమర్శించింది. అయితే అజరెంకా విమర్శల్లో నిజం లేదని వింబుల్డన్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు.  అన్ని కోర్టుల్లో నాణ్యత అద్భుతంగా ఉందన్నారు.
 
 సానియా జోడి శుభారంభం డబుల్స్‌లో భారత క్రీడాకారులు సానియా మీర్జా, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న శుభారంభం చేశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-హుబెర్ (అమెరికా) జంట 6-3, 3-6, 6-1తో వొరాకోవా-జకోపలోవా (చెక్ రిపబ్లిక్) జోడిపై గెలిచింది. మహేశ్ భూపతి-నోల్ (ఆస్ట్రియా) 6-2, 6-7, 6-4, 6-2తో మాయెర్ (అర్జెంటీనా)-రామోస్ (స్పెయిన్) లపై; బోపన్న-వాసెలిన్ (ఫ్రాన్స్) 7-6, 6-2, 7-6తో తుర్సునోవ్ (రష్యా) -నిమినెన్ (ఫిన్‌లాండ్) లపై విజయం సాధించారు.
 

మరిన్ని వార్తలు