నాడు దోషి... నేడు విజేత

10 Sep, 2014 01:07 IST|Sakshi
నాడు దోషి... నేడు విజేత

శతాబ్దంన్నర కంటే ఎక్కువ చరిత్ర కలిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆసియా క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక సింగిల్స్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే జపాన్ యువకెరటం కీ నిషికోరి రూపంలో తొలిసారి ఆసియా క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. దాంతో యూఎస్ ఓపెన్‌లో ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని యావత్ జపాన్‌తోపాటు ఆసియా మొత్తం వేయి కళ్లతో ఎదురుచూసింది. అయితే క్రొయేషియా ఆజానుబాహుడు మారిన్ సిలిచ్ అసమాన ఆటతీరు ముందు నిషికోరి చేతులెత్తేయడంతో ఆసియా అభిమానులకు నిరాశ తప్పలేదు.
 
తుది మెట్టుపై నిషికోరి బోల్తా
యూఎస్ ఓపెన్ చాంపియన్ సిలిచ్
కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం

 
న్యూయార్క్: ఆసియా నుంచి పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను చూసేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. సంచలన విజయాలతో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జపాన్ యువతార కీ నిషికోరి పోరాటం టైటిల్ పోరులో ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-3తో పదో సీడ్ నిషికోరిపై గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు.
 
అంతేకాకుండా సిలిచ్ కెరీర్‌లో ఇది 300వ విజయం కావడం విశేషం. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సిలిచ్ 17 ఏస్‌లు సంధించడంతోపాటు నిషికోరి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు సిలిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒకేసారి సఫలమైన నిషికోరి 30 అనవసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. విజేతగా నిలిచిన సిలిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు); రన్నరప్ నిషికోరికి 14 లక్షల 50 వేల డాలర్లు (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
 
2001లో గొరాన్ ఇవానిసెవిచ్ (వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రొయేషియా క్రీడాకారుడిగా సిలిచ్ నిలిచాడు. యాదృచ్ఛికంగా ప్రస్తుతం సిలిచ్‌కు ఇవానిసెవిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ సాధించిన ఫైనల్ విజయాలు సోమవారమే రావడం విశేషం. తాజా ప్రదర్శనతో సిలిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి, నిషికోరి 8వ స్థానానికి ఎగబాకారు.  
 
స్థిరమైన ఆటతీరు

క్వార్టర్స్‌లో ఆరో సీడ్ బెర్డిచ్‌ను, సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్‌ను వరుస సెట్‌లలో ఓడించి ఫైనల్ చేరిన సిలిచ్ అదే దూకుడును టైటిల్ పోరులోనూ ప్రదర్శించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న సిలిచ్ బుల్లెట్ వేగంతో కూడిన భారీ సర్వీస్‌లు... కచ్చితమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు... నెట్‌వద్ద చలాకీతనంతో నిషికోరి ఆట కట్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్‌పై, మూడో సీడ్ వావ్రింకాపై, ఐదో సీడ్ రావ్‌నిక్‌లపై అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరిన నిషికోరి తుదిపోరులో సిలిచ్ జోరు ముందు ఎదురునిలువలేకపోయాడు. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 68 కేజీల బరువున్న నిషికోరి మ్యాచ్ మొత్తంలో రెండో సెట్‌లో మాత్రమే ఒకసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు.
 
తన ప్రధాన ఆయుధం శక్తివంతమైన సర్వీస్‌లను నమ్ముకున్న సిలిచ్ ఆరోగేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో సిలిచ్ ఒకసారి తన సర్వీస్ కోల్పోయినా వెంటనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌పై తన పట్టుబిగించాడు. మూడో సెట్‌లోనూ సిలిచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.  తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌లో క్రాస్‌కోర్టు బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో సిలిచ్ మ్యాచ్‌ను ముగించాడు.
 
* ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక 14వ సీడ్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి.
* పీట్ సంప్రాస్ (2002లో-ప్రపంచ 17వ ర్యాంకర్) తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్‌లో లేని క్రీడాకారుడు యూఎస్ ఓపెన్‌ను (సిలిచ్-ప్రపంచ 16వ ర్యాంకర్) గెలవడం ఇదే ప్రథమం. గాస్టన్ గాడియో (ప్రపంచ 44వ ర్యాంకర్; 2004-ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత సిలిచ్ రూపంలో టాప్-10లో లేని క్రీడాకారుడు ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు.
* గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అత్యంత పొడగరి క్రీడాకారుడిగా యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా-2009 యూఎస్ ఓపెన్) సరసన సిలిచ్ చేరాడు. ఈ ఇద్దరూ 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్నారు.
*   ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్‌ను కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నెగ్గిన 13వ క్రీడాకారుడు సిలిచ్. గతంలో ఆండీ ముర్రే (2012), డెల్‌పొట్రో (2009), లీటన్ హెవిట్ (2001) ఈ ఘనత సాధించారు.
* ఓపెన్ శకంలో చివరి మూడు మ్యాచ్‌ల్లో (క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్) ఒక్క సెట్ కోల్పోకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఐదో ఆటగాడు సిలిచ్. గతంలో ఫెడరర్ (2003-వింబుల్డన్), రిచర్డ్ క్రాయిసెక్ (1996-వింబుల్డన్), ప్యాట్ క్యాష్ (1987-వింబుల్డన్), గిలెర్మో విలాస్ (1977-ఫ్రెంచ్ ఓపెన్) ఈ ఘనత సాధించారు.
 
నాడు దోషి... నేడు విజేత

క్లిష్ట పరిస్థితులు గొప్ప వ్యక్తుల్లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి. మారిన్ సిలిచ్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్‌లో సిలిచ్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా... మోకాలి నొప్పితో వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే ఏప్రిల్‌లో మ్యూనిచ్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు అతనికి వింబుల్డన్ టోర్నీలో సమాచారం ఇవ్వడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తర్వాత తెలిసింది.
 
దాంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సిలిచ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఫలితంగా సిలిచ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. 2013 చివర్లో తన చిన్ననాటి అభిమాన క్రీడాకారుడు గొరాన్ ఇవానిసెవిచ్‌ను కోచ్‌గా నియమించుకున్నాడు. అదే సమయంలో తన నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేశాడు. తన సహాయక సిబ్బందిలో ఎవరో తెలియకుండా తనకు నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న మాత్రలను ఇవ్వడంతోనే ఇలా జరిగిందని వాదించాడు. సిలిచ్ వాదనలతో ఏకభవించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ నిషేధాన్ని నాలుగు నెలలకు కుదించింది.
 
సత్తా ఉన్నా సరైన ప్రణాళిక లేకపోవడంతో సిలిచ్‌లో ఉన్న అసలు చాంపియన్ బయటకు రావడంలేదని ఇవానిసెవిచ్ గ్రహించాడు. అతని ఆటలోని లోపాలను సవరించాడు. అతని ప్రధాన ఆయుధమైన భారీ సర్వీస్‌లకు మరింతగా పదును పెట్టాడు. పదేపదే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని సూచించాడు.
 
అయితే సిలిచ్ తన ఆటతీరును మార్చుకోవడానికి ఆరేడు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో అనుకున్న ఫలితం వచ్చింది. మూడో రౌండ్‌లో 18వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), నాలుగో రౌండ్‌లో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), సెమీఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్) లను ఓడించిన సిలిచ్ ఫైనల్లో పదో సీడ్ నిషికోరిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. డోపింగ్‌లో దోషిగా తేలి కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో సిలిచ్ స్థయిర్యం కోల్పోకుండా పరిణతితో వ్యవహరించాడు. పట్టుదలే పెట్టుబడిగా పోరాటం చేసి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌ను చక్కదిద్దుకున్నాడు.   

మరిన్ని వార్తలు