-

నేనేం మోడల్‌ను కాదు: బర్తోలీ

9 Jul, 2013 16:59 IST|Sakshi
మారియా బర్తోలీ

 ‘నేను ఎప్పుడూ మోడల్ కావాలని కలలు కనలేదు. కాబట్టి అందం గురించి ఆలోచించడం అనవసరం. అయితే వింబుల్డన్ గెలవాలని మాత్రం కలగన్నాను. దానిని నెరవేర్చుకున్నాను’ అని తాజా చాంపియన్ మారియా బర్తోలీ వ్యాఖ్యానించింది. బర్తోలీ టైటిల్ నెగ్గిన అనంతరం బీబీసీ వ్యాఖ్యాత ఒకరు బర్తోలీ అందగత్తె కాదు అని కామెంట్ చేస్తూ షరపోవాతో పోల్చే ప్రయత్నం చేశాడు.

అందం లేదు కాబట్టి ఆట బాగా ఆడాల్సిందే అంటూ ఆమె తండ్రి బర్తోలీని ప్రోత్సహించి ఉంటాడు అంటూ ఇందులో సదరు వ్యాఖ్యాత అభిప్రాయ పడ్డాడు. దాంతో ఈ మాటలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. కొన్ని గంటల్లోనే బీబీసీకి వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయితే బర్తోలీ వీటిని తేలిగ్గా తీసుకుంది.

బొద్దుగా ఉన్నా... ముచ్చట గొలిపే ఆటతీరుతో మరియన్ బర్తోలీ వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్ గా నిలిచింది. వింబుల్డన్ ఫైనల్లో 15వ సీడ్ బర్తోలీ జర్మనీకి చెందిన 23వ సీడ్ సబైన్ లిసికిపై విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆరేళ్ల క్రితం తృటిలో తప్పిన విజయాన్ని మళ్లీ సాధించి వింబుల్డన్ చాంపియన్ గా అవతరించింది.

మరిన్ని వార్తలు