ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్‌

17 Feb, 2020 11:22 IST|Sakshi

ఇక్కడ ఇగోలకు తావులేదు..

కేప్‌టౌన్‌: 2018లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సందర్భంలో వర్క్‌ లోడ్‌ ఎక్కువ అయ్యిందని భావించిన డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అటు తర్వాత గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగిన తరుణంలో మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్‌ ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు.  

ఇటీవల దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ నియామకం జరగడంతో డివిలియర్స్‌ రీఎంట్రీ షురూ అయ్యింది. దీనిపై డివిలియర్స్‌ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన బౌచర్‌.. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయాలని యత్నిస్తున్నాడు. దాంతోనే తన సహచర క్రికెటర్లలో ఒకడైన ఏబీతో స్వయంగా మాట్లాడి మరీ ఒప్పించాడు.

దీనిలో భాగంగానే తాను టీ20లతో పాటు వన్డేలకు సైతం అందుబాటులో ఉంటానని ఏబీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం డివిలియర్స్‌కే రీఎంట్రీ నిర్ణయంపై బౌచర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా టీ20 వరల్డ్‌కప్‌కు ఏబీ ఫామ్‌లో ఉంటేనే జట్టులోకి తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చాడు. అతని జాబ్‌కు న్యాయం చేయగలడని భావిస్తే అతన్ని టీ20 వరల్డ్‌కప్‌లో కొనసాగిస్తామన్నాడు.టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ జట్టు ఉండాలనే లక్ష్యంతోనే కసరత్తు చేస్తున్నాం.  

ఒక మంచి జట్టు ఉంటేనే వరల్డ్‌కప్‌ను సాధించడం జరుగుతుంది. ఒక పోటీ ఇచ్చే జట్టునే సిద్ధం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా. ఏబీ ఫామ్‌లో ఉండి సరైన వాడు అనుకుంటే టీ20 వరల్డ్‌కప్‌లో అతని ఎంపిక ఉంటుంది. ఇక్కడ ఇగోలకు తావులేదు’ అని బౌచర్‌ తెలిపాడు. అంటే ఏబీ ఫామ్‌లో లేకపోతే మాత్రం జట్టులో కష్టం అనేది బౌచర్‌ మాటల్ని బట్టి అర్థమవుతుంది. అయితే టీ20 వరల్డ్‌కప్‌ కంటే ముందు ఐపీఎల్‌ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏబీ సత్తాచాటితే మాత్రం​ అప్పుడు అతనికి ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తలు