ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

2 Aug, 2019 17:50 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మొదటి రోజు ఆట మధ్యలోనే ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కాలిపిక్క గాయంతో అర్థాంతరంగా వైదొలగగా,  ఇప్పుడు మరో ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ పక్కటెముకల గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ మార్క్‌వుడ్‌.‌  వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ సాధించడంలో మార్క్‌వుడ్‌ కూడా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్వించాడు.  ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో మార్క్‌వుడ్‌ 18 వికెట్లతో ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌లోనే న్యూజిలాండ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో పక్కటెముకల బాధతోనే బౌలింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే యాషెస్‌ సిరీస్‌లో చోటు దక్కించుకున్న మార్క్‌వుడ్‌కు తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. కాగా, మళ్లీ అదే  గాయంతో సతమవుతున్న మార్క్‌వుడ్‌ యాషెస్‌ సిరీస్‌ నుంచి వైదొలగక తప్పలేదు.

2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన మార్క్‌వుడ్‌ తరచు గాయాల బారిన పడుతూ ఉండటంతో అతని కెరీర్‌ సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకూ 13 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే మార్క్‌వుడ్‌ ఆడాడు.  యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మధ్యలోనే అండర్సన్‌ కాలిపిక్క గాయంతో వైదొలిగిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసిన అండర్సన్‌ పెవిలియన్‌ వీడాడు. అతనికి స్కానింగ్‌లు నిర్వహించగా కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని తేలింది. దాంతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో అండర్సన్‌ ఆడటం అనుమానంగా మారింది. ఇప్పడు మార్క్‌వుడ్‌ గాయం ఇంగ్లండ్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది. బౌలింగ్‌ యూనిట్‌ను గాయాల బెడద వేధించడం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది.

మరిన్ని వార్తలు