అపూర్వం ... అద్భుతం... అద్వితీయం

4 Apr, 2016 02:03 IST|Sakshi
అపూర్వం ... అద్భుతం... అద్వితీయం

6, 6, 6, 6

ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్లో జరిగిన విధ్వంసం ఇది. వెస్టిండీస్ హిట్టర్ బ్రాత్‌వైట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా... ఆశలు లేని దశలో అతనిలోని హిట్టర్ బయటికి వచ్చాడు. ఆరు బంతులేం ఖర్మ అంటూ భారీ సిక్సర్లు బాది  రెండు బంతుల ముందే మ్యాచ్‌ను ముగించాడు. వెస్టిండీస్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. సెమీఫైనల్ వరకు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన స్టోక్స్‌కు... ఫైనల్లో మాత్రం బ్రాత్‌వైట్ స్ట్రోక్ తగిలింది.

 కరీబియన్ల డబుల్ ధమాకా
క్రికెట్ చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టం... ఒకే దేశానికి చెందిన మహిళల, పురుషుల జట్లు ఒకేసారి చాంపియన్స్ అయ్యాయి.మహిళల క్రికెట్‌లో ఇదో అద్భుత ఘట్టం... ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన వెస్టిండీస్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.టి20 చరిత్రలో ఇదో అద్వితీయ క్షణం... తొలిసారి వెస్టిండీస్ పురుషుల జట్టు ప్రపంచకప్‌ను రెండోసారి గెలిచింది.అవును... కరీబియన్స్ భారత గడ్డపై శివతాండవం చేశారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఈడెన్ గడ్డపై సంచలనం సృష్టించారు. మధ్యాహ్నం జరిగిన మహిళల ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాకిస్తే... రాత్రి జరిగిన పురుషుల ఫైనల్లో సంచలన ఆటతీరుతో కరీబియన్స్ రెండోసారి కప్‌ను ముద్దాడారు.

గేల్ గర్జించకపోయినా... ఇంగ్లండ్‌కు వణుకు పుట్టింది. శామ్యూల్స్ అనే యోధుడి పోరాటానికి... బ్రాత్‌వైట్ పవర్ హిట్టింగ్ తోడవడంతో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 54;7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36;1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత విండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి నెగ్గింది. శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దుమ్మురేపారు.

  శామ్యూల్స్  మరోసారి
2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 56 బంతుల్లో 78 పరుగులు చేసి వెస్టిండీస్‌ను గెలిపించిన శామ్యూల్స్... మరోసారి ఒంటరి పోరాటంతో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపాడు. ఈసారి అజేయంగా 66 బంతుల్లో 85 పరుగులు చేసి యోధుడిలా ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్ చివరి వరకు నిలబడ్డాడు.
 


 స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) బద్రీ 0; హేల్స్ (సి) బద్రీ (బి) రసెల్ 1; రూట్ (సి) బెన్ (బి) బ్రాత్‌వైట్ 54; మోర్గాన్ (సి) గేల్ (బి) బద్రీ 5; బట్లర్ (సి) బ్రేవో (బి) బ్రాత్‌వైట్ 36; స్టోక్స్ (సి) సిమన్స్ (బి) బ్రేవో 13; అలీ (సి) రామ్‌దిన్ (బి) బ్రేవో 0; జోర్డాన్ (నాటౌట్) 12; విల్లీ (సి) చార్లెస్ (బి) బ్రాత్‌వైట్ 21; ప్లంకెట్ (సి) బద్రీ (బి) బ్రేవో 4; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155.

 వికెట్ల పతనం: 1-0; 2-8; 3-23; 4-84; 5-110; 6-110; 7-111; 8-136; 9-142. బౌలింగ్: బద్రీ 4-1-16-2; రసెల్ 4-0-21-1; బెన్ 3-0-40-0; బ్రేవో 4-0-37-3; బ్రాత్‌వైట్ 4-0-23-3; స్యామీ 1-0-14-0.

వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) స్టోక్స్ (బి) రూట్ 1; గేల్ (సి) స్టోక్స్ (బి) రూట్ 4; శామ్యూల్స్ (నాటౌట్) 85; సిమన్స్ (ఎల్బీ) (బి) విల్లీ 0; బ్రేవో (సి) రూట్ (బి) రషీద్ 25; రసెల్ (సి)  స్టోక్స్ (బి) విల్లీ 1; స్యామీ (సి) హేల్స్ (బి) విల్లీ 2; బ్రాత్‌వైట్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161.  వికెట్ల పతనం: 1-1; 2-5; 3-11; 4-86; 5-104; 6-107.

బౌలింగ్: విల్లీ 4-0-20-3; రూట్ 1-0-9-2; జోర్డాన్ 4-0-36-0; ప్లంకెట్ 4-0-29-0; రషీద్ 4-0-23-1; స్టోక్స్ 2.4-0-41-0.
 
 
 ప్రైజ్‌మనీ (పురుషుల విభాగం)
 
విజేత  :-   16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు)
 
రన్నరప్  :-  8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 29 లక్షలు)

సెమీస్‌లో ఓడిన జట్లకు:-  4 లక్షల డాలర్లు (రూ. 2 కోట్ల 64 లక్షలు)
 
 ప్రైజ్‌మనీ (మహిళల విభాగం)
 
 విజేత :- లక్ష డాలర్లు (రూ. 66 లక్షల 23 వేలు)
 
రన్నరప్:-  50 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు)

మరిన్ని వార్తలు