మూడో స్థానానికి పడిపోయిన కోహ్లి ర్యాంకు

25 Dec, 2017 17:38 IST|Sakshi

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో పెళ్లి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  శ్రీలంకతో వన్డే, టీ-20 సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలిక కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం వెలువడిన ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో కోహ్లి ర్యాంకు అమాంతం పడిపోయింది. దీంతో సోషల్‌ మీడియాలో అప్పుడే జోకులు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, శ్రీలంకతో టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఇంగ్లండ్‌, ‌న్యూజిల్యాండ్‌, వెస్టిండీస్ జట్లను వెనుకకునెట్టి.. రెండోస్థానాన్ని సొంతం చేసుకుంది. లంకతో సిరీస్‌కు ముందుకు టీమిండియాకు 119 పాయింట్లు ఉండగా.. సిరీస్‌ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో దాయాది పాకిస్థాన్‌ మొదటిస్థానంలో కొనసాగుతుంది.

ఇక, పెళ్లి కారణంగా లంక సిరీస్‌కు దూరమవ్వడంతో ప్రభావం కోహ్లి టీ-20 ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో కోహ్లి ర్యాంకు మొదటి స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. టీ-20 సిరీస్‌కు దూరమైన కారణంగా కోహ్లి పాయింట్లు 824 నుంచి 776కు పడిపోయాయి. కోహ్లిని అధిగమించి ఆరన్‌ ఫించ్‌ మొదటి ర్యాంకు సొంతం చేసుకోగా,  వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఎవిన్‌ లెవిస్‌ రెండోర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ర్యాంకు కూడా మూడోస్థానానికి పడిపోయింది. లంకతో తొలి రెండు టీ-20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా వికెట్లేమీ తీయని సంగతి తెలిసిందే. ఇక కేఎల్‌ రాహుల్‌ నాలుగో ర్యాంకును సొంతం చేసుకోగా.. 43 బంతుల్లో 118 పరుగులు చేసి రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ 14 ర్యాంకుకు ఎగబాకాడు.

మరిన్ని వార్తలు