మార్టిన్‌ గప్టిల్‌ ‘టీ20 బ్లాస్ట్‌’

28 Jul, 2018 11:54 IST|Sakshi

నార్తాంప్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్టిల్‌ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో గప్టిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వర్సెస్టర్‌షైర్‌ తరపున బరిలోకి దిగిన గప్టిల్‌.. శుక్రవారం నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం సాధించాడు.  ఫలితంగా ఓవరాల్‌  టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా నాల్గో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు 35 బంతుల్లో టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన క్రికెటర్లలో డేవిడ్‌ మిల్లర్ (దక్షిణాఫ్రికా)‌, రోహిత్‌ శర్మ(భారత్‌), లూయిస్‌ వాన్‌డెర్‌(నమీబియా)లు ఉన్నారు. కాగా, టీ20ల్లో వేగవంతమైన  సెంచరీ క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ 30 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో రిషబ్‌ పంత్‌ ఉన్నాడు.  నార్తాంప్టన్‌షైర్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గప్టిల్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద ఉండగా గప్టిల్‌(102: 38 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అతనికి జతగా జో క్లార్క్‌(61;33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో వర్సెస్టర్‌షైర్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు