' ఆ స్టార్ ప్లేయర్కు వ్యక్తిత్వం లేదు'

10 Jun, 2016 17:58 IST|Sakshi
' ఆ స్టార్ ప్లేయర్కు వ్యక్తిత్వం లేదు'

చికాగో:లియోనల్ మెస్సీ పరిచయం అవసరం లేని పేరు. ప్రప్రంచంలోని అన్ని దేశాల్లో  విశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నఫుట్ బాల్ ఆటగాడు. అయితే అర్జెంటీనాకు చెందిన మెస్సీపై తాజాగా ఆ దేశానికే చెందిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ డిగో మారడోనా విమర్శనాస్త్రాలు సంధించాడు. అసలు మెస్సీకి వ్యక్తిత్వమే లేదంటూ తీవ్రంగా ధ్వజమెత్తాడు. ప్రస్తుతం అర్జెంటీనా జట్టులో పోస్టర్ తరహా పాత్రను పోషిస్తూ ఫీల్డ్లో ఒక గొప్ప నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నాడంటూ మండిపడ్డాడు. 'మెస్సీ ఒక మంచి వ్యక్తి. కానీ అతనికి వ్యక్తిత్వం లేదు. అతను తన క్యారెక్టర్ను కోల్పోయి జట్టుకు నాయకుడిగా మారాడు' అని మారడోనా ధ్వజమెత్తాడు.

 

అయితే మెస్సీని కోచ్ గెరార్డో మార్టినో వెనుకేసుకొచ్చాడు. తమకు మెస్సీ సామర్థ్యంపై విపరీతమైన నమ్మకం ఉందని మార్టినో పేర్కొన్నాడు. అంతకుముందు అర్జెంటీనాకు కెప్టెన్గా వ్యహరించిన జాయిర్ మాస్చరానో ను మెస్సీ నాయకత్వం పోలి ఉంటుందని కితాబిచ్చాడు. గతంలో మాస్చరానో  జట్టులో ఏ తరహా కీలక పాత్ర పోషించాడో, అదే తరహాలో మెస్సీ కూడా జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తాడని మార్టినో పేర్కొన్నాడు. కాగా, మారడోనా వ్యాఖ్యలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని మార్టినో స్పష్టం చేశాడు. ఫుట్ బాల్ లో ఎప్పుడూ సహజసిద్ధమైన నాయకులే ఉంటారంటూ మెస్సీని వెనకేసుకొచ్చాడు. ఇదిలా ఉండగా, కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్లో శనివారం పనామాతో తలపడనుంది.

మరిన్ని వార్తలు