మేరీకోమ్‌ బాధ్యతారాహిత్యం!

22 Mar, 2020 00:14 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందు కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యులతో పాల్గొన్న భారత మహిళా దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌

స్వీయ నిర్బంధంలో ఉండకుండా బయటకు

రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరు

ఎవరితోనూ కరచాలనం చేయలేదని వివరణ

న్యూఢిల్లీ: ఆమె ఒలింపిక్‌ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, జాతీయ రెండో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ గ్రహీత కావడంతో పాటు పార్లమెంట్‌ సభ్యురాలు కూడా.  కానీ కరోనాతో దేశం అల్లకల్లోలమవుతున్న వేళ తన బాధ్యత మరచింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనను ఉల్లంఘించింది. ఇదంతా భారత మహిళా బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ గురించే. జోర్డాన్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు జరిగిన ఆసియా క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ టోర్నీలో ఆమె పాల్గొంది.

ఆ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన భారత బాక్సర్లంతా రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని బాక్సింగ్‌ సమాఖ్య ముందే చెప్పింది. దీనిని జట్టు సభ్యులంతా కచ్చితంగా పాటించాలని కోచ్‌ శాంటియాగో నీవా కూడా బాక్సర్లకు ముందే స్పష్టం చేసి దానికి తగినట్లుగా వారు ఇంట్లో చేసుకునేందుకు  ఫిట్‌నెస్‌ షెడ్యూల్‌ను కూడా సూచించారు. ఈ బాక్సర్లంతా ఈ నెల 13న భారత్‌కు చేరుకున్నారు. కానీ మేరీకోమ్‌ మాత్రం దీనిని పట్టించుకున్నట్లుగా లేదు. ఈ నెల 18న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అల్పాహార విందులో ఆమె పాల్గొంది. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్‌ చేసిన చిత్రాలలో ఇతర పార్లమెంట్‌ సభ్యులతో పాటు మేరీకోమ్‌ కూడా ఉంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందులో తాను పాల్గొన్న విషయాన్ని మేరీకోమ్‌ కూడా నిర్ధారించింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేసింది. ‘జోర్డాన్‌ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక్క రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న రాజస్తాన్‌ సీఎం వసుంధర రాజే తనయుడు, పార్లమెంట్‌ సభ్యుడు దుష్యంత్‌ సింగ్‌ను కలవడం గానీ కరచాలనం చేయడం గానీ చేయలేదు. జోర్డాన్‌ పర్యటన తర్వాత నిర్దేశించిన నా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినా సరే రాబోయే 3–4 రోజులు ఇంట్లోనే ఉంటాను’ అని ఆమె స్పష్టం చేసింది.

సిమ్రన్‌జిత్‌ కూడా... 

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో సిమ్రన్‌

మేరీకోమ్‌ కంటే ముందుగా భారత్‌కే చెందిన మరో మహిళా బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ కూడా స్వీయ నిర్భంధం నిబంధనను ఉల్లంఘించింది. జోర్డాన్‌లోనే జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సిమ్రన్‌జిత్‌ పాల్గొని 60 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా గుర్తింపు పొందింది. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన సిమ్రన్‌జిత్‌ మార్చి 16న  పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను... రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధిని... శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ను కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు సిమ్రన్‌జిత్‌కు పంజాబ్‌ ప్రభుత్వం రూ. 5 లక్షలు... శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తరఫున సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ రూ. లక్ష నగదు పురస్కారం అందజేశారు. జోర్డాన్‌లోనూ కోవిడ్‌–19 వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు జోర్డాన్‌లో 69 కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు