సింధుకు పద్మభూషణ్‌

26 Jan, 2020 02:00 IST|Sakshi
పీవీ సింధు, మేరీకోమ్‌,

మేరీకోమ్‌కు పద్మవిభూషణ్‌ క్రీడల్లో 8 మందికి ‘పద్మ’ పురస్కారాలు

న్యూఢిల్లీ: తెలుగుతేజం పీవీ సింధు కీర్తి కిరీటంలో మరో పురస్కారం దర్జాగా చేరింది. భారత ప్రభుత్వం ప్రపంచ చాంపియన్‌ సింధును మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. మహిళా స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌కు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్‌’ అందుకోనుంది. 71వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పలురంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు చోటుదక్కింది. మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్, భారత మహిళల హాకీ కెపె్టన్‌ రాణి రాంపాల్, పురుషుల హాకీ మాజీ కెప్టెన్‌ ఎం.పి.గణేష్, స్టార్‌ షూటర్‌ జీతు రాయ్, మహిళల ఫుట్‌బాల్‌ మాజీ సారథి ఒయినమ్‌ బెంబెం దేవి, ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌లు ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపికయ్యారు.
 
అప్పుడు ‘పద్మ’... ఇప్పుడు భూషణ్‌
మన సింధుకిది రెండో పద్మ పురస్కారం. ఐదేళ్ల క్రితం 2015లో ఆమెకు పద్మశ్రీ దక్కింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగుతేజం ఖాతాలో ఇప్పటికే 5 ప్రపంచ చాంపియన్‌íÙప్‌ పతకాలున్నాయి. గతేడాది జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్‌లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి. ఇది వరకే పద్మశ్రీ (2006), పద్మభూషణ్‌ (2013)లు అందుకున్న మణిపూర్‌ బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీకోమ్‌ తాజాగా ‘పద్మవిభూషణ్‌’గా ఎదిగింది. స్పోర్ట్స్‌లో ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో వ్యక్తి మేరీ.

మాజీ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్, దివంగత పర్వతారోహకుడు ఎడ్మండ్‌ హిల్లరి (న్యూజిలాండ్‌), క్రికెట్‌ ఎవరెస్ట్‌ సచిన్‌ టెండూల్కర్‌లు మాత్రమే పద్మవిభూషణ్‌ అందుకున్నారు. సచిన్‌ అనంతరం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. 41 ఏళ్ల జహీర్‌ఖాన్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన టీమిండియా సభ్యుడు. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 25 ఏళ్ల భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ 241 మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. క్వాలిఫికేషన్‌ మ్యాచ్‌ల్లో అమెరికాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సాధించడంలో రాణి కీలకపాత్ర పోషించింది.

మరిన్ని వార్తలు