మేరీనే క్వాలిఫయర్స్‌కు...

29 Dec, 2019 03:17 IST|Sakshi
నిఖత్‌ జరీన్‌,మేరీకోమ్‌

ఫైనల్లో 9–1తో నిఖత్‌పై విజయం

తెలంగాణ బాక్సర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రపంచ మాజీ చాంపియన్‌   

ఆమె ఒక దిగ్గజ బాక్సర్‌. ఒకట్రెండు సార్లు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... ఐదుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచింది. అంతేనా... భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌కు మణిపూస లాంటిది. రాష్ట్రపతి స్వయంగా ఎగువసభకు నామినేట్‌ చేసిన ఎంపీ కూడా! అంతటి మేటి బాక్సర్‌ ఏకపక్ష విజయం సాధించడం వరకు బాగానే ఉన్నా... అనుభవరీత్యా తనకంటే ఎంతో జూనియర్‌ అయిన ప్రత్యర్థితో తలపడుతున్నపుడు... విజయానంతరం ఆమె వ్యవహరించిన తీరు క్రీడాలోకాన్ని విస్మయపరిచింది.

ఇంతకాలం తన పంచ్‌లతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ కాగా... ఈ మణిపూర్‌ బాక్సర్‌కు సవాల్‌ విసిరిన క్రీడాకారిణి తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌. కొన్ని నెలలుగా ఎంతో ఉత్కంఠరేపిన మహిళల బాక్సింగ్‌ ట్రయల్స్‌ శనివారంతో ముగియగా... భారత్‌ నుంచి టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి వెళ్లే ఐదుగురు బాక్సర్లు కూడా ఖరారయ్యారు.

న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి అర్హత పొందింది. మహిళల 51 కేజీల ట్రయల్‌ ఫైనల్‌ బౌట్‌లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. మిగతా ట్రయల్స్‌ పోటీల్లో 57 కేజీల్లో రెండుసార్లు ప్రపంచ రజత పతక విజేత అయిన సోనియా లాథర్‌కు చుక్కెదురైంది. సాక్షి చౌదరి ధాటికి ఆమె ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ చాంపియన్‌ సరితా దేవి కూడా జాతీయ చాంపియన్‌ సిమ్రన్‌జీత్‌ కౌర్‌ చేతిలో కంగుతింది. 69 కేజీల విభాగంలో లలితాపై లవ్లీనా బొర్గొహైన్‌... 75 కేజీల విభాగంలో నుపుర్‌పై పూజా రాణి గెలిచి క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదించారు. ఆసియా ఓసియానియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ పోటీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు చైనాలో జరుగుతాయి. ఇందులో రాణించిన బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తారు.  

హోరాహోరీ అనుకున్నా...
తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. తనకూ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ అవకాశమివ్వాలంటూ పట్టుపట్టి మరీ ట్రయల్స్‌ పెట్టాలంది. ఒలింపిక్స్‌ అర్హతే లక్ష్యంగా పగలూ రాత్రి కష్టపడిన ఆమె... మేరీతో దీటుగా తలపడే అవకాశముందని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) కూడా భావించింది. అందుకే ఆమె ప్రతిభకు వెన్నంటే నిలిచింది. నిఖత్‌కు మద్దతు తెలిపేందుకు ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డితోపాటు తెలంగాణ బాక్సింగ్‌ సంఘం ప్రతినిధులు ఢిల్లీకి కూడా వెళ్లారు. అయితే తీరా పోటీదగ్గరకొచ్చేసరికీ ఏకపక్షమవుతుందని ఎవరూ ఊహించలేదు. 36 ఏళ్ల మణిపూర్‌ వెటరన్‌ దిగ్గజాన్ని ఢీకొట్టడం అంత సులువు కాదని బౌట్‌ మొదలైన కాసేపటికే తెలంగాణ అమ్మాయికి తెలిసొచ్చింది.

స్పష్టమైన పంచ్‌ లతో మేరీకోమ్‌ విజృంభిస్తుంటే నిఖత్‌ వద్ద సమాధానం లేకపోయింది. ఈ నిజామాబాద్‌ జిల్లా బాక్సర్‌ సంధించిన పంచ్‌లు బౌట్‌ను పర్యవేక్షించిన జడ్జిలను ఆకట్టుకోలేకపోయాయి. కేవలం ఒక్కరు మాత్రమే నిఖత్‌కు పాయింట్‌ ఇవ్వగా... మిగతా తొమ్మిది మంది మేరీకోమ్‌ పైచేయి సాధించిందని భావించారు. అయితే విజయగర్వంతో ప్రత్యరి్థకి కనీస గౌరవం ఇవ్వకుండా మేరీకోమ్‌ రింగ్‌ నుంచి బయటికి రావడం పలు విమర్శలకు తావిచ్చింది. తనతో పోరాడిన ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ బాక్సర్‌కు మేరీలాంటి దిగ్గజం కరచాలనం చేయకపోవడం దారుణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి.  

అసలేమైంది... ఏమిటీ వివాదం
భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ తీసుకున్న నిర్ణయం ట్రయల్స్‌ వివాదాన్ని రేపింది. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌íÙప్‌లో మేరీ కాంస్యం గెలిచింది. దీంతో ఆయన పతక విజేతలకు నేరుగా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ బెర్త్‌లని ప్రకటించారు. అంటే ట్రయల్స్‌లో పాల్గొనకుండా మేరీకి మినహాయింపు ఇవ్వడం ఏంటని ఆ కేటగిరీ (51 కేజీలు)లో ఉన్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రశి్నంచింది. బీఎఫ్‌ఐ తీరుపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా కేంద్ర క్రీడాశాఖకు లేఖ రాసింది.

ట్రయల్స్‌ పోటీల ద్వారానే ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్త్‌లు ఖరారు చేయాలని కోరింది. లండన్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాలాంటి ఆటగాళ్లు ఆమె ట్రయల్స్‌ కోరడాన్ని సమరి్థంచారు. దీనిపై స్పందించిన ఆ శాఖ ట్రయల్స్‌ నిర్వహించాలంటూ బీఎఫ్‌ఐను ఆదేశించింది. దీంతో నేరుగా చైనా (క్వాలిఫయర్స్‌) వెళ్లే అవకాశాన్ని పోటీదాకా తెచ్చిన నిఖత్‌ జరీన్‌పై మేరీ కోపం పెంచుకుంది. అందుకేనేమో బౌట్‌ ముగిశాక చేయి కలపలేదు. ప్రత్యర్థితో ఏ మాత్రం హుందాగా ప్రవర్తించకుండా తన మానాన తాను వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు