క్వార్టర్‌ ఫైనల్లో మేరీకోమ్‌

10 Oct, 2019 04:22 IST|Sakshi

లవ్లినా, జమున కూడా

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్

వులన్‌ వుడే (రష్యా): భారత వెటరన్‌ మహిళా బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌íÙప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు లవ్లినా బొర్గొహెయిన్‌ (69 కేజీలు), జమున బొరొ (54 కేజీలు) కూడా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మేరీకి తొలిరౌండ్లో బై లభించింది. అనంతరం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ జుటమస్‌పై గెలుపొందింది. మేరీ స్పష్టమైన పంచ్‌లకు జడ్జిలంతా ఆమెకే ఓటేశారు. దీంతో బౌట్‌లో గెలిచినట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. జడ్జిలు మేరీకి 30 పాయింట్లు, జిట్‌పాంగ్‌కు 27 పాయింట్లు ఇచ్చారు. 36 ఏళ్ల మేరీకోమ్‌ ఇప్పుడు పతకానికి విజయం దూరంలో ఉంది. అయితే క్వార్టర్‌ ఫైనల్లో ఆమెకు గట్టి ప్రత్యర్థి ఎదురైంది. భారత బాక్సర్‌... పాన్‌ అమెరికా చాంపియన్, రియో ఒలింపిక్స్‌ కాంస్య విజేత ఇంగ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా)తో తలపడనుంది.

54 కేజీల ప్రిక్వార్టర్స్‌లో జమున... ఐదో సీడ్‌ ఒయిడాడ్‌ ఫౌ (అల్జీరియా)ను కంగుతినిపించింది. ఈ బౌట్‌లోనూ జడ్జిలు జమున గెలిచినట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. 69 కేజీల విభాగంలో మూడో సీడ్‌ లవ్లినా బొర్గొహెయిన్‌ 5–0తో ఒమైమా బెల్‌ అబిబ్‌ (మొరాకో)పై నెగ్గింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య విజేత అయిన లవ్లినా క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ కరోలినా కొస్జెవ్‌స్కా (పొలండ్‌)తో, జమున... జర్మనీకి చెందిన ఉర్సు లా గొట్లాబ్‌తో పోటీపడతారు. ఇది వరకే మంజు రాణి (48 కేజీలు), కవిత చహల్‌ (ప్లస్‌ 81 కేజీలు) కూడా క్వార్టర్స్‌ చేరారు. దీంతో మొత్తం ఐదుగురు భారత బాక్సర్లు పతకం వేటలో పడ్డారు. నేటి క్వార్టర్స్‌లో గెలిచి సెమీస్‌ చేరితే వీరికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది.

మరిన్ని వార్తలు