బౌట్‌ తర్వాత మేరీకోమ్‌ ఇలా.. వీడియో వైరల్‌

28 Dec, 2019 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ:  తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై ఘన విజయం సాధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన మేరీకోమ్‌.. బౌట్‌ తర్వాత అసహనాన్ని ప్రదర్శించింది. భారత బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేసిన మేరీకోమ్‌..  నిఖత్‌ జరీన్‌తో బౌట్‌ తర్వాత క్రీడా స్ఫూర్తిని మాత్రం మరిచింది. ఆ బౌట్‌లో గెలిచిన మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి జరీన్‌ చేయి చాపగా దాన్ని తిరస్కరించింది. నిఖత్‌ జరీన్‌ చేతిని విదిల్చుకుని మరీ వెళ్లిపోయింది. గతంలో ఈ బౌట్‌ కోసం జరిగిన రాద్దాంతాన్ని మనసులో పెట్టుకున్న మేరీకోమ్‌ హుందాగా వ్యవహరించడాన్ని మరచిపోయింది. దీనిపై బౌట్‌ తర్వాత వివరణ కోరగా తాను ఎందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది మేరీకోమ్‌. ‘ ఆమెకు నేను ఎందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి. మిగతా వాళ్ల నుంచి ఆమె గౌరవం కోరితే తొలుత  గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ తరహా మనుషుల్ని ఇష్టపడను. నేను కేవలం రింగ్‌లో మాత్రమే ఆమెతో అమీతుమీ తేల్చుకోవాలి. అంతేకానీ బయట కాదు కదా’ అంటూ మేరీకోమ్‌ వ్యాఖ్యానించింది.(ఇక్కడ చదవండి: ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి)

ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం)  జరిగిన పోరులో మేరీకోమ్‌ 9-1 తేడాతో నిఖత్‌ జరీన్‌పై గెలుపొందారు.  ఫలితంగా మేరీకోమ్‌ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్‌ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్‌ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్‌ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్‌ అయిన మేరీకోమ్‌ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మళ్లీ గెలిచిన తర్వాత కూడా నిఖత్‌ ట్రయల్స్‌ పెట్టాలనే నిర్ణయాన్ని మేరీకోమ్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు సాటి బాక్సర్‌ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని కామెంట్లు వస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు