బీఎఫ్‌ఐ ఆదేశిస్తే... నిఖత్‌తో బౌట్‌కు సిద్ధమే

20 Oct, 2019 02:28 IST|Sakshi

భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ‘నిఖత్‌ జరీన్‌తో తలపడేందుకు నాకెలాంటి భయం లేదు’ అని భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రకటించింది. ‘భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఆదేశిస్తే... ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం నిర్వహించే సెలక్షన్‌ ట్రయల్స్‌ బౌట్‌లో నిఖత్‌ను ఓడించి లాంఛనం పూర్తి చేస్తాను’ అని రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఈ మణిపూర్‌ బాక్సర్‌ స్పష్టం చేసింది.  శనివారం ఓ సన్మాన కార్యక్ర మంలో పాల్గొనేందుకు వచ్చిన మేరీకోమ్‌ తాజా వివాదంపై స్పందించింది. ‘బీఎఫ్‌ఐ తీసుకున్న నిర్ణయాన్ని, నిబంధనలను నేను మార్చలేను. పోటీపడటమే నాకు తెలుసు. బీఎఫ్‌ఐ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. వారు నిఖత్‌తో ట్రయల్స్‌ బౌట్‌లో తలపడాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీపడతాను’ అని 36 ఏళ్ల మేరీకోమ్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు