ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు: మేరీ కోమ్‌

21 Mar, 2020 18:26 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ బాక్సర్‌ మేరీ కోమ్‌ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. జోర్డాన్‌లోని అమ్మన్‌లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్‌ క్వాలిఫైయర్స్‌లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్‌ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్‌ మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మార్చి 13న స్వదేశానికి చేరుకున్న మేరీ కోమ్‌.. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఆమె ఎంపీ దుష్యంత్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కనిక! )

ఈ నేపథ్యంలో మేరీ కోమ్ శనివారం మీడియాతో మాట్లాడారు. జోర్డాన్‌ నుంచి వచ్చిన నాటి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యానని.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ను తాను కలవలేదని తెలిపారు. తన క్వారంటైన్‌ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ కనికా కపూర్‌ ఓ పార్టీలో రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్‌ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం విదితమే. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. (మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్‌)

>
మరిన్ని వార్తలు