ఐదో స్వర్ణంపై గురి..!

7 Nov, 2017 17:40 IST|Sakshi

హో చి మిన్‌ సిటీ (వియ త్నాం):ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ మీట్ లో భారత బాక్సర్ మేరీకోమ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో భాగంగా 48 కేజీల విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో సుబాసా కొమురా (జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో ఈ చాంపియన్ షిప్ లో నాలుగుసార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన మేరీకోమ్.. మరో పసిడి పోరుకు సిద్ధమైంది. ఆసియా చాంపియన్ షిప్ మీట్ లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మేరీకోమ్ ఫైనల్లోకి ప్రవేశించింది.

బౌట్ తరువాత తన ప్రదర్శనపై మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది.. గత కొన్నేళ్లుగా తన దేశం కోసం పోరాడటం ఎంతో అద్భుతమైన అనుభూతిని కల్గిస్తూ ఉందని స్పష్టం చేసింది.  ఇక్కడ ప్రత్యేకంగా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) ప్రెసిడెంట్ అజయ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఆయన సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని మేరీకోమ్ పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఫైనల్ కు చేరిన మేరీకోమ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఫైనల్ పోరులో మరింత శక్తితో రాణించాలంటూ సచిన్ ఆకాంక్షించాడు. అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో  ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మరిన్ని వార్తలు