నిఖత్‌ x మేరీకోమ్‌

28 Dec, 2019 02:46 IST|Sakshi

నేడు ట్రయల్స్‌ పోరు

గెలిస్తే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు సమయం వచ్చేసింది. నేడు జరిగే బౌట్‌లో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌తో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తలపడనుంది. 51 కేజీల విభాగంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంది.  ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా ఈ ముఖాముఖీ జరగనుంది. ఇందులో గెలిచే బాక్సర్‌కే ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్‌ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్‌ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్‌ జ్యోతి గులియాను, మేరీకోమ్‌ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు.

51 కేజీలో విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్‌ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్‌ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్‌ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్‌ అయిన మేరీకోమ్‌ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరక ర వ్యాఖ్యలు చేసింది. బాక్సింగ్‌ వర్గాల్లో ఎక్కువ మం ది నిఖత్‌కే అం డగా నిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రయల్స్‌కు సమాఖ్య ఒప్పుకుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా