ఎంపీగా గెలిచిన బంగ్లా కెప్టెన్‌

31 Dec, 2018 20:41 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున నరైల్-2 లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ బంగ్లా కెప్టెన్‌ ఘన విజయం సాధించాడు. 35 ఏళ్ల మొర్తాజాకు మొత్తం 2,74,418 ఓట్లు రాగా, అతడి సమీప ప్రత్యర్థికి 8,006 ఓట్లు వచ్చాయి. తద్వారా క్రికెట్‌ ఆడుతూనే ఎంపీగా గెలిచిన వ్యక్తిగా మొర్తాజా చరిత్రకెక్కాడు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం 300 స్థానాలకు గాను అవామీ లీగ్ ఏకంగా 288 స్థానాలను కైవసం చేసుకుంది.

ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు చిన్న హింట్‌ ఇచ్చాడు. అనుకున్నట్లే అవామీ లీగ్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు. దీంతో 2019 ప్రపంచకప్ తర్వాత ఈ పేసర్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్‌ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు.

మరిన్ని వార్తలు