మాథ్యూస్‌కు భారత్‌పైనే ‘మూడు’

6 Jul, 2019 18:57 IST|Sakshi

లీడ్స్‌:  వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌(113; 128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు.  ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని మాథ్యూస్‌ శతకంతో సత్తా చాటాడు. శ్రీలంక స్వల్ప వ్యవధిలో ప్రధాన వికెట్లు కష్టాల్లో పడ్డ సమయంలో మాథ్యూస్‌ ఆదుకున్నాడు. లహిరు తిరిమన్నే(53; 68 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తిరిమన్నేను ఐదో వికెట్‌గా కుల్దీప్‌ ఔట్‌ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై ధనంజయ డిసిల్వాతో కలిసి మరోసారి ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశాడు. ఈ జోడి 74 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలోనే 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది మాథ్యూస్‌కు మూడో వన్డే సెంచరీ కాగా, ఆ మూడు సెంచరీలు భారత్‌పైనే చేయడం ఇక్కడ విశేషం. డిసిల్వా(29 నాటౌట్‌) చివరి వరకూ క్రీజ్‌లో ఉండటంతో శ్రీలంక 265 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు ఆదిలోనే షాక్‌ తగలింది. లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే(10) నిరాశపరచగా, కాసేపటకి కుశాల్‌ పెరీరా(18) కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో లంక 40 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ రెండు వికెట్లను జస్‌ప్రీత్‌ బుమ్రా సాధించాడు. కొద్ది సేపటి తర్వాత అవిష్కా ఫెర్నాండో(20)ను హార్దిక్‌ పాండ్యా బోల్తా కొట్టించగా,కుశాల్‌ మెండిస్‌ను జడేజా ఔట్‌ చేశాడు. దాంతో 55 పరుగులకే లంకేయులు నాలుగు వికెట్లను చేజార్చుకున్నారు. ఆ తర్వాత తనకు భారత్‌పై ఉన్న మంచి రికార్డును కొనసాగిస్తూ మాథ్యూస్‌ సమయోచితంగా ఆడాడు. వంద పరుగులకు పైగా భాగస్వామ్యంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా సెంచరీ సాధించాడు. దాంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.


 


 

మరిన్ని వార్తలు