న్యూజిలాండ్‌ లక్ష్యం 245

6 Jun, 2019 04:51 IST|Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో తమకన్నా పెద్ద జట్టయిన దక్షిణాఫ్రికాపై 330 పరుగుల భారీస్కోరు చేసి గెలుపొందిన బంగ్లాదేశ్‌ జట్టు... రెండో మ్యాచ్‌లో అదే జోరును కనబరచలేకపోయింది. ఇక్కడి కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెరీర్‌లో 200వ వన్డే ఆడిన సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (68 బంతుల్లో 64; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 4 వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ 2 వికెట్లు పడగొట్టాడు.  245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కడపటి వార్తలందే సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (25; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కొలిన్‌ మున్రో (24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్లను షకీబ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. రాస్‌ టేలర్‌ (83 బంతుల్లో 76 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), నీషమ్‌ (9 బంతుల్లో 8 బ్యాటింగ్‌; సిక్స్‌) క్రీజులో ఉన్నారు.  

మరిన్ని వార్తలు