ప్రతీ మ్యాచ్‌లో గట్టిగా పోరాడతాం

14 May, 2017 02:08 IST|Sakshi

ఆదివారం టాటెన్‌హామ్‌తో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే విషయంలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ కాస్త డైలమాలో పడింది. ఎందుకంటే యూరోపా లీగ్‌ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఆ మ్యాచ్‌ కోసం తమ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా? లేక ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌–4లో నిలిచేందుకు పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలా? అనేది తేల్చుకోలేకపోతోంది. ఈ జట్టు యూరోపా లీగ్‌ నెగ్గితే నేరుగా చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు యూరోపా లీగ్‌ సెమీస్‌లో జట్టును గెలిపించిన డిఫెండర్‌ మాటియో డార్మియాన్‌ మాత్రం టాటెన్‌హామ్‌తో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

మీ జట్టు ఇప్పుడు యూరోపా లీగ్‌ ఫైనల్‌కు చేరింది. గెలిస్తే చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధిస్తారు. ఒత్తిడి పెద్దగా లేకపోవడంతో టాటెన్‌హామ్‌పై విశ్రాంతి తీసుకుంటారా?
అలా ఏం లేదు. ఫైనల్‌కు వెళ్లిన మాట నిజమే అయినా ఈపీఎల్‌లో మాకు ఇంకా మూడు మ్యాచ్‌లున్నాయి. ముందు అవి గెలవాల్సి ఉంది. విజయం సాధించిన ఉత్సాహంతో యూరోపా లీగ్‌ ఆడితే ఆ మజా వేరుగా ఉంటుంది.

అయితే ఆదివారం మ్యాచ్‌లో నీవు పాల్గొంటున్నావా?
కచ్చితంగా... మా జట్టు ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించేందుకే బరిలోకి దిగుతుంది. ఈపీఎల్‌లో మేం ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంది.

యూరోపా లీగ్‌ సెమీస్‌లో మీ ఆటగాళ్లు గాయాలబారిన పడ్డారు. ఇప్పుడు టాటెన్‌హామ్‌తో మ్యాచ్‌ చాలా కష్టంగా మారనుందా?
అవును. ఎందుకంటే గాయాల నుంచి కోలుకునేందుకు మాకు ఎక్కువ సమయం లభించలేదు. అలాగే టాటెన్‌హామ్‌ పటిష్ట జట్టు. అయితే ఇందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. అదీగాకుండా వైట్‌ హార్ట్‌ లేన్‌ మైదానంలో ఇదే చివరి మ్యాచ్‌. దీని తర్వాత స్టేడియం పునర్‌నిర్మాణం కాబోతుంది. అందుకే ఇది మాకు ప్రత్యేక మ్యాచ్‌.

యూరోపా లీగ్‌ ఫైనల్లో అజాక్స్‌తో జరిగే మ్యాచ్‌లో మీరే ఫేవరెట్టా?
అది ఇప్పుడే చెప్పలేం. అజాక్స్‌ చాలా పెద్ద క్లబ్‌. అలాగే చాలా గట్టిపోటీదారు. అయితే ఫైనల్‌కు చేరడం మాకు గర్వంగా ఉంది. దీంతో కచ్చితంగా కప్‌ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే వచ్చే సీజన్‌లో చాంపియన్స్‌ లీగ్‌కు కూడా అర్హత సాధిస్తాం కాబట్టి ఆ మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యం.

మరిన్ని వార్తలు