కోహ్లి మూడో స్థానంలో ఆడితేనే బాగుంటుంది : హెడెన్‌

15 Jan, 2020 11:04 IST|Sakshi

ముంబై : మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాభవం మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు మాథ్యూ హేడెన్‌ కోహ్లిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రసుత్తం హెడెన్‌ కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

'విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు 243 మ్యాచ్‌లు ఆడగా అందులో 180 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో ఆడి 63.09 స్ర్టైక్‌ రేట్‌తో 10వేల పరుగులకు పైగా సాధించాడు. అతనికి అచ్చి వచ్చిన స్థానం నుంచి కోహ్లి ఎందుకు తప్పుకోవాలి. అందరూ భారత ఓటమి గురించే మాట్లాడుతున్నారు గానీ ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌ కోసం కోహ్లి తన స్థానాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సిందే' అంటూ హేడెన్‌ పేర్కొన్నాడు.

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతి కల్పించడంతో ధావన్‌,రాహుల్‌లు ఓపెనింగ్‌లో రాగా కోహ్లి మూడో స్థానంలో వచ్చాడు. అయితే లంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్‌తో పాటు జట్టులో పునరాగమనం చేసిన ధావన్‌ కూడా బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రాహుల్‌, ధావన్‌లలో ఎవరికి చోటు కల్పించాలనేదానిపై సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇక చేసేదేంలేక కోహ్లి తన మూడో స్థానాన్ని రాహుల్‌కు ఇచ్చేసి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 38 ఇన్నింగ్స్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 1751 పరుగులు చేశాడు. దీంట్లో 7 శతకాలు, 8అర్థశతకాలు ఉన్నాయి. 2015 నుంచి 6సార్లు నాలుగోస్థానంలో బరిలోకి దిగిన కోహ్లి అంతగా ఆకట్టుకోలేదు. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 9,4, 3, 11, 12, 7, 16 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు