‘పాండ్యా కన్నా మావాడే బెటర్‌’

20 Feb, 2019 10:55 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌ అంటేనే మాటల యుద్దం. అందులోనూ స్వదేశంలో ఘోర ఓటమి అనంతరం టీమిండియా పర్యటన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు కవ్వింపులకు దిగుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ కోహ్లి సేనకు ఆసీస్‌ ఆటగాళ్లతో ఇబ్బందులు తప్పవంటున్నాడు. ముందుగా ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. స్వదేశమైనా, విదేశమైనా తనదైన రీతిలో రెచ్చిపోవడమే స్టోయినిస్‌కు తెలుసంటూ కితాబిచ్చాడు. ఈ సందర్భంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ప్రస్తావిస్తూ.. పాండ్యా కంటే స్టోయినిసే గొప్ప ఆటగాడంటూ వ్యాఖ్యానించాడు. పాండ్యా ఇంకా మెరుగుపడాలని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవరుచుకోవాలని హెడెన్‌ సూచించాడు. 

ధవన్‌కు ఇబ్బందులు తప్పవు..
టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌తో ఇబ్బందులు తప్పవని ఈ ఆసీస్‌ మాజీ దిగ్గజ ఆటగాడు హెచ్చరించాడు. కమిన్స్‌ తన వైవిద్య బంతులతో ధవన్‌ను బోల్తా కొట్టిస్తాడనన్నాడు. స్వింగ్‌, షార్ట్‌ పిచ్‌ బంతులు ఆడటంలో పరిణితి సాధించాలని ధవన్‌కు సూచించాడు. అయితే భారత్‌ మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. చహల్‌తో ఆసీస్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌కు ఇబ్బందేనని వివరించాడు. భారత్‌ పిచ్‌లపై మ్యాక్స్‌వెల్‌ రాణించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఈ యువ స్పిన్నర్‌ 40 వన్డేల్లో 71 వికెట్లు, 29 టీ20ల్లో 45 వికెట్లు తీశాడని.. దీంతోనే చహల్‌ ప్రతిభ అర్థమవుతుందని హెడెన్‌ తెలిపాడు.  

ఇక భారత్‌ పర్యటనలో ఆసీస్‌ జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ నెల 24న తొలి టీ20 జరగనుంది. స్వదేశంలో ఆసీస్‌పై సిరీస్‌లు గెలిచి ఆత్మస్థైర్యంతో ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టాలని కోహ్లిసేన భావిస్తుండగా.. స్వదేశంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్‌ జట్టు ఆరాటపడుతోంది. 
 

మరిన్ని వార్తలు