రాయుడును వీడని ‘3డి’

2 Jul, 2019 04:45 IST|Sakshi

తీవ్ర ప్రభావం చూపిన నాటి సెటైర్‌ ట్వీట్‌

సాక్షి క్రీడా విభాగం: మరోసారి ప్రపంచ కప్‌ అవకాశం మన అంబటి తిరుపతి (ఏటీ) రాయుడు చేజారింది. జట్టులో నాలుగో స్థానానికి ఎంపికైన విజయ్‌ శంకర్‌ గాయం నుంచి తప్పుకున్నా... అదే స్థానానికి చివరి వరకు పోటీ పడిన రాయుడుకు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ కప్‌ స్టాండ్‌ బై ఆటగాళ్లలో అతని పేరు ఉన్నా, అసలు సమయానికి మాత్రం ఆ చాన్స్‌ మయాంక్‌ ఎగరేసుకుపోయాడు. పునరాగమనం తర్వాత నిలకడైన ప్రదర్శనతో ‘4’కు సరైనవాడు అని కోహ్లితో ప్రశంసలు పొందినా...న్యూజిలాండ్‌ గడ్డపై భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచినా దురదృష్టవశాత్తూ రాయుడును సెలక్టర్లు గుర్తించలేదు.

ఇప్పుడు జట్టు ఉన్న పరిస్థితుల్లో మిడిలార్డర్‌లో సమర్థంగా ఆడగల సత్తా రాయుడుకి ఉందనడంలో సందేహం లేదు. ఓపిగ్గా ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పాటు అవసరమైన సమయంలో ధాటిగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. సెలక్టర్ల ఎంపిక ప్రక్రియే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఓపెనర్‌ ధావన్‌ గాయపడితే ఒక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పంత్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ తప్పుకుంటే ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని ఓపెనర్‌ను ఎంచుకున్నారు.

తనను కాదని శంకర్‌ను ఎంపిక చేస్తూ ‘త్రీ డైమెన్షనల్‌ ఆటగాడు’ అంటూ ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యానించడం... పరోక్షంగా దానిపై సెటైర్‌ విసురుతూ ‘వరల్డ్‌ కప్‌ చూసేందుకు 3డి అద్దాలు కొన్నాను’ అంటూ రాయుడు ట్వీట్‌ చేయడం వివాదం రేపింది. ఏదో స్థానం కోల్పోయిన బాధలో అన్నాడు పాపం కాబట్టి చర్య తీసుకోవడం లేదు అని బీసీసీఐ పెద్దలు కొందరు అప్పట్లో వ్యాఖ్యానించినా... ఆ విషయాన్ని వారంతా తేలిగ్గా వదిలి పెట్టలేదని అర్థమవుతోంది. తమనే ప్రశ్నించిన రాయుడుకు మళ్లీ అవకాశం ఇవ్వరాదనే సంకేతం తాజా ఎంపికలో కనిపించిందనడంలో సందేహం లేదు.  

ఇదీ మయాంక్‌ రికార్డు...
భారత్‌ తరఫున ఆస్ట్రేలియాతో 2 టెస్టులు ఆడి ఆకట్టుకున్న కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో ఇంకా అరంగేట్రమే చేయలేదు. దేశవాళీ వన్డేల్లో (లిస్ట్‌ ఎ) 75 మ్యాచ్‌లలో 48.71 సగటుతో 3,605 పరుగులతో అతనికి చెప్పుకోదగ్గ రికార్డు ఉంది. అతని స్ట్రయిక్‌ రేట్‌ కూడా 100.72 కావడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతను 61.60 సగటుతో వన్డేల్లో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకున్న మయాంక్‌ అగర్వాల్‌... గత ఏడాది భారత ‘ఎ’ తరఫున ఇంగ్లండ్‌ గడ్డపై 4 వన్డేల్లో 71.75 సగటు, 105.90 స్ట్రయిక్‌ రేట్‌తో 287 పరుగులు సాధించడం అతని ఎంపికకు కారణమైంది. ప్రపంచ కప్‌కు ఎంపిక చేసేందుకు బీసీసీఐకి రాసిన లేఖలో ‘సరైన టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌’ కావాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరడాన్ని బట్టి చూస్తే అతడిని ఓపెనింగ్‌ స్థానానికే ఎంపిక చేశారని అర్థమవుతోంది. 

మరిన్ని వార్తలు