ఫైనల్లో భారత్ ‘ఎ’

13 Aug, 2015 23:53 IST|Sakshi
ఫైనల్లో భారత్ ‘ఎ’

 మయాంక్, మనీష్ సెంచరీల మోత
 దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం
 నేడు ఆసీస్‌తో అమీతుమీ

 
 చెన్నై: మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 176; 20 ఫోర్లు; 5 సిక్సర్లు), మనీష్ పాండే (85 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఫైనల్‌కు చేరింది. చిదంబరం స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో తుది పోరు జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్, ఉన్ముక్త్ (77 బంతుల్లో 64; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు సెంచరీ (106) భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు.
 
 ఆ తర్వాత పాండే, మయాంక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టి20 తరహా హిట్టింగ్‌తో సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ఈ జోడి రెండో వికెట్‌కు 203 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (86 బంతుల్లో 113; 10 ఫోర్లు; 6 సిక్సర్లు), ఖాయా జోండో (60 బంతుల్లో 86; 7 ఫోర్లు; 5 సిక్సర్లు) వేగంగా ఆడి విజయం కోసం ప్రయత్నించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. హెండ్రిక్స్ (109 బంతుల్లో 76; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అక్షర్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి.
 
 ఫైనల్
 భారత్ ‘ఎ’ ఆసీస్ ‘ఎ’
 ఉదయం 9 గంటల నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

 

మరిన్ని వార్తలు