అయ్యో... హైదరాబాద్‌

22 Feb, 2018 10:27 IST|Sakshi

క్వార్టర్స్‌లో కర్ణాటక చేతిలో 103 పరుగులతో ఓటమి

 మయాంక్, సమర్థ్‌ సెంచరీలు

 సిరాజ్‌ (5/59) శ్రమ వృథా

 విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ పోరాటం ముగిసింది. బుధవారం కర్ణాటకతో ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ 103 పరుగులతో ఓటమి పాలైంది. మయాంక్‌ అగర్వాల్‌ (111 బంతుల్లో 140; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), సమర్థ్‌ (124 బంతుల్లో 125; 13 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (5/59) ఈ టోర్నీలో మూడోసారి ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనలో ఒక దశలో 202/3తో పటిష్టంగా కనిపించిన హైదరాబాద్‌... 42 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి 42.5 ఓవర్లలో 244కే ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది.  

సెంచరీల జోరు...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కర్ణాటకకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ (10)ను సిరాజ్‌ పెవిలియన్‌ పంపాడు. అనంతరం మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్, ఆర్‌. సమర్థ్‌ సాధికారికంగా ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన ఈ జోడీ... చూస్తుండగానే 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా మయాంక్‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు రవితేజ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 242 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్ది సేపటికే సమర్థ్‌ను రవికిరణ్‌ పెవిలియన్‌ పంపాడు. ఈ దశలో సిరాజ్‌ తన పేస్‌ తో బెంబేలెత్తించాడు. వరుస బంతుల్లో  దేశ్‌పాండే (19), కె. గౌతమ్‌ (0)లను వెనక్కి పం పిన అతను వరుస ఓవర్లలో స్టువర్ట్‌ బిన్నీ (5), సీఎం గౌతమ్‌ (20)లను అవుట్‌ చేశాడు. దీంతో 43 ఓవర్లలో 301/2తో ఉన్న కర్ణాటక చివరకు 347/8తో నిలిచింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ 2, రవితేజ ఒక వికెట్‌ పడగొట్టారు.  

చివర్లో తడబాటు...

భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి (10) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ రాయుడు (28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రవితేజ (57 బంతుల్లో 53; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 71 పరుగులు జతచేసి పరిస్థితిని చక్కదిద్దారు. 14 పరుగుల వ్యవధిలో వీరిద్దరు పెవిలియన్‌ చేరినా సందీప్‌ (42; 3 ఫోర్లు), కెప్టెన్‌ అంబటి రాయుడు (62 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 34 ఓవర్లలో జట్టు స్కోరు 202/3కి చేరింది. లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో కర్ణాటక బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ (5/31) చెలరేగడంతో రాయుడు బృందం వరుసగా వికెట్లు కోల్పోయి 42.5 ఓవర్లలో 244 పరుగులకే పరిమితమైంది. స్టువర్ట్‌ బిన్నీకి 3 వికెట్లు దక్కాయి.  

స్కోరు వివరాలు

కర్ణాటక ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) తనయ్‌ (బి) రవితేజ 140; కరుణ్‌ నాయర్‌ ఎల్బీడబ్ల్యూ (బి) సిరాజ్‌ 10; సమర్థ్‌ (సి) భండారి (బి) రవికిరణ్‌ 125; పవన్‌ దేశ్‌పాండే (సి) రాయుడు (బి) సిరాజ్‌ 19; బిన్నీ (సి) రోహిత్‌ రాయుడు (బి) సిరాజ్‌ 5; కృష్ణప్ప గౌతమ్‌ (సి) రాయుడు (బి) సిరాజ్‌ 0; సీఎం గౌతమ్‌ (బి) సిరాజ్‌ 20; గోపాల్‌ (నాటౌట్‌) 11; అరవింద్‌ (సి) త్యాగరాజన్‌ (బి) రవికిరణ్‌ 3; ప్రదీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 347.

వికెట్ల పతనం: 1–29, 2–271, 3–303, 4–306, 5–306, 6–319, 7–334, 8–340.
బౌలింగ్‌: రవికిరణ్‌ 10–0–61–2, సిరాజ్‌ 10–0–59–5, సందీప్‌ 3–0–22–0, మెహదీ హసన్‌ 10–0–65–0, రవితేజ 9–0–65–1, తనయ్‌ 4–0–34–0, ఆకాశ్‌ భండారి 2–0– 27–0, సాకేత్‌ సాయిరామ్‌ 2–0–22–0.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ రాయుడు (సి) దేశ్‌పాండే (బి) బిన్నీ 28; అక్షత్‌ రెడ్డి (సి) ప్రదీప్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 10; రవితేజ (రనౌట్‌) 53; సందీప్‌ (స్టంప్డ్‌) సీఎం గౌతమ్‌ (బి) గోపా ల్‌ 42; అంబటి రాయుడు (సి) ప్రసిద్ధ్‌ కృష్ణ (బి) గోపాల్‌ 64; తనయ్‌ (సి) సమర్థ్‌ (బి) గోపాల్‌ 20; భండారి (బి) బిన్నీ 3; సాయి రామ్‌ (నాటౌట్‌) 9; మెహదీ హసన్‌ (సి) మయాంక్‌ (బి) గోపాల్‌ 1; సిరాజ్‌ (సి) సమర్థ్‌ (బి) బిన్నీ 2; రవికిరణ్‌ ఎల్బీడబ్ల్యూ (గోపాల్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం(42.5ఓవర్లలో ఆలౌట్‌) 244.

వికెట్ల పతనం: 1–19, 2–90, 3–104, 4–202, 5–213, 6–230, 7–236, 8–239, 9–243, 10–244.
బౌలింగ్‌: ప్రసిద్ధ్‌ కృష్ణ 6–1–26–1, ప్రదీప్‌ 7–0–51–0, అరవింద్‌ 6–0–35–0, కె. గౌతమ్‌ 9–0–49–0, బిన్నీ 8–0–45–3, గోపాల్‌ 6.5–0–31–5.

మరిన్ని వార్తలు