ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన బిన్నీ భార్య

17 Apr, 2019 14:33 IST|Sakshi

‘క్షమించండి. నాకు తెలిసి కింగ్స్‌ ఎలెవన్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చూడలేదనుకుంటా. మరేం పర్లేదు. #MarutiSuzukiCricketLiveలో హెచ్‌డీలో మ్యాచులు వీక్షించండి. ఓకేనా’ అంటూ తన భర్త, క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీని ట్రోల్‌ చేసిన వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ మయంతి లాంగర్‌.  ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా మోహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటి ఈ మ్యాచ్‌ ద్వారా రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ ఈ సీజన్‌లో తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో (11 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.

చదవండి : (సొంతగడ్డపై పంజాబ్‌ ప్రతాపం)

అయితే ఇన్నాళ్లుగా బిన్నీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవడంతో.. కొంతమంది నెటిజన్లు... ‘ స్టువర్ట్‌ ఎక్కడ మయంతి. అసలు తను ఆడతాడా’  అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. మరికొంత మంది బిన్నీ ప్రదర్శనను పొగుడుతూనే.. ‘ఈనాటి ఇన్నింగ్స్‌ కారణంగా మొట్ట మొదటిసారి మయంతి సోలో డీపీ తీసేసి.. భర్తతో ఉన్న ఫొటో పెట్టింది’ అంటూ ఆమెను ట్రోల్‌ చేశారు. ఇందుకు స్పందించిన మయంతి.. ‘ నిజమా? మీ దగ్గర నా నెంబర్‌ లేదనుకుంటా. నిజానికి నేను డీపీగా ఏ ఫొటో పెట్టానో మీకు తెలిసే అవకాశం లేదు. అయితే ఇంత మంచి ఫొటోను వెదికిపెట్టినందుకు మీకు ధన్యవాదాలు’  అంటూ వాళ్ల నోర్లు మూయించారు.

కాగా ప్రస్తుతం ఇండియాలో ఉన్న గొప్ప స్పోర్ట్స్‌ ప్రజెంటర్లలో ఒకరిగా మయంతి కీర్తి గడించారు. 2012లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీని పెళ్లాడారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు తమ తమ ప్రొఫెషన్లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ.. భర్త కంటే కూడా మయంతినే ఓ మెట్టు పైన ఉందని, అందుకే బిన్నీని ఆమె లెక్కచేయదంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మయంతి కూడా వారికి గట్టిగా సమాధానమిస్తూనే యాంకర్‌గా దూసుకుపోతున్నారు.

మరిన్ని వార్తలు