మీ పని చూసుకోండి!

2 Sep, 2016 09:16 IST|Sakshi
మీ పని చూసుకోండి!

విమర్శకులకు మయంతి ఘాటు జవాబు  
బెంగళూరు: ఒక ఆటగాడు విఫలమైనప్పుడు అతడిని కాకుండా ‘దురభిమానులు’ అతడి వెనుక ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో  ఆడిపోసుకోవడం ఇటీవల తరచూ కనిపిస్తోంది. కోహ్లి బాగా ఆడని రోజు అనుష్క శర్మపై అంతా విరుచుకు పడ్డారు. ఇప్పుడు స్టువర్ట్ బిన్నీ వైఫల్యంపై అతని భార్య మయంతి లంగర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. విండీస్‌తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో స్టువర్ట్ 32 పరుగులిచ్చిన తర్వాత ఇది మొదలైంది.

గతంలో కూడా మయంతి అందచందాలపై చాలా మంది పలు వ్యాఖ్యలు చేసినా... ట్విట్టర్‌లో ఈ సారి బిన్నీ ఆటకు ఆమెను బాధ్యులను చేయడం మయంతికి ఆగ్రహం తెప్పించింది. ఏం చేసి అతడిని భారత జట్టులో ఉంచుతున్నావని కొందరంటే, వెంటనే విడాకులు తీసుకొమ్మని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అసలు ఆత్మహత్య చేసుకోలేకపోయావా అని కూడా మయంతిని అడిగేశారు! చివరకు దీనిపై మయంతి స్పందించింది.

‘ఆత్మహత్య చేసుకోమని చెప్పడం చూస్తే సిగ్గుగా అనిపిస్తోంది. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు తగిన ప్రేమాభిమానాలు దక్కాలని కోరుకుంటున్నా. మమ్మల్ని విమర్శించడంలో మీకు చాలా ఆనందం లభిస్తుందని అనిపిస్తోంది. నేను 18 ఏళ్ల వయసునుంచి సంపాదిస్తున్నాను. డబ్బు కోసం బిన్నీని చేసుకున్నానని అనే బదులు వెళ్లి ఒక మంచి ఉద్యోగం చూసుకోండి.  మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది’ అని లంగర్ సమాధానం ఇచ్చింది.

మరిన్ని వార్తలు