నాకౌట్‌కు ఫ్రాన్స్‌

22 Jun, 2018 01:34 IST|Sakshi

  0–1 ఓటమితో పెరూ ఔట్‌

 కైలిన్‌ ఎంబాపె ఏకైక గోల్‌

ప్రపంచ కప్‌లో పేరుకే ఉందనుకున్న పెరూ... ఫ్రాన్స్‌కు మాత్రం ఓ పట్టాన కొరుకుడు పడలేదు. మాజీ చాంపియన్‌ ఆటలు సాగకుండా చూసిన ఈ దక్షిణ అమెరికా జట్టు... మ్యాచ్‌లో ఎక్కువ భాగం ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, మొదటి భాగంలోనే గోల్‌ ఇచ్చుకుని, దానిని అందుకోలేకపోయింది.  వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడి టోర్నీ నిష్క్రమించింది.  

ఎకతెరినాబర్గ్‌: మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌... ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా గురువారం పెరూతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 1–0తో ఆ జట్టు విజయం సాధించింది. ఈ గోల్‌ను 34వ నిమిషంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కైలిన్‌ఎంబాపె చేశాడు. ఓడినా, తన కంటే చాలా పెద్ద జట్టయిన ఫ్రాన్స్‌పై పెరూ ఆట ఆకట్టుకుంది. రెండు భాగాల్లో బంతిపై ఆ జట్టుదే ఆధిపత్యం. మొత్తం 56 శాతం బంతి పెరూ ఆధీనంలోనే ఉన్నా... గోల్‌ కొట్టడంలో విఫలమై కనీసం డ్రా చేసుకోలేకపోయింది. ఈ ఫలితంతో ఫ్రాన్స్‌ 6 పాయింట్లతో నాకౌట్‌కు వెళ్లగా, రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైన పెరూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

ఆధిపత్యం చూపినా... 
ఫ్రాన్స్‌ ఆశ్చర్యకరంగా తడబడగా, మ్యాచ్‌ మొదటినుంచి పెరూ మెరుగ్గా ఆడింది. క్రమంగా కుదురుకున్న మాజీ చాంపియన్‌ ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించడానికి ప్రయత్నించింది. ఇందులో ఒలివర్‌ గిరోడ్‌ సఫలమయ్యాడు. 34వ నిమిషంలో అతడు కొట్టిన షాట్‌ను పెరూ డిఫెండర్‌ అడ్డుకున్నాడు. దానిని గోల్‌ కీపర్‌ అందుకునే యత్నంలో ఉండగా... దూసుకొచ్చిన ఎంబాపె లాఘవంగా గోల్‌ పోస్ట్‌లోకి పంపి ఖాతా తెరిచాడు. ప్రతిస్పందనగా పెరూ ఆటగాడు గ్యురెరో గోల్‌కు యత్నించినా ఫ్రాన్స్‌ కీపర్‌ హ్యూగో లోరిస్‌ విజయవంతంగా 

అడ్డుకున్నాడు.  ప్రయత్నించినా... 
టోర్నీలో నిలవాలంటే కనీసం డ్రా చేసుకోవాల్సి ఉండటంతో రెండో భాగం ప్రారంభం నుంచే పెరూ ఆటలో తీవ్రత పెంచింది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి పెనాల్టీ ఏరియాలోకి దూసుకెళ్లారు. అయితే ఫ్రాన్స్‌ వీటన్నిటిని అడ్డుకుంది. మరోవైపు పెడ్రో అక్వినో కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌ ఫ్రేమ్‌ను తాకుతూ పోయింది. మ్యాచ్‌ ముగుస్తుందనగా మరింత దూకుడు చూపినా, సబ్‌స్టిట్యూట్‌లను బరిలో దింపినా ఫ్రాన్స్‌ రక్షణ శ్రేణి ముందు ఇవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో పెరూ ఆటగాళ్లు నిరాశగా మైదానం వీడారు. 

మరిన్ని వార్తలు