‘మన్కడింగ్’లో మార్పు లేదు

19 Jul, 2014 01:42 IST|Sakshi

స్పష్టం చేసిన ఎంసీసీ
 లండన్: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘మన్కడింగ్’ నిబంధనను మార్చాల్సిన అవసరం లేదని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ తేల్చి చెప్పింది.  మన్కడింగ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని అభిప్రాయ పడింది. బౌలర్ బంతి విసరక ముందే (డెలివరీ స్ట్రైడ్ పూర్తి కాకుండా) నాన్‌స్ట్రైకర్ ఆటగాడు క్రీజ్‌ను విడిచి ముందుకు వెళితే అతడిని బౌలర్ అవుట్ చేయవచ్చని మన్కడింగ్ నిబంధన చెబుతోంది. అయితే తరచూ ఇది వివాదాస్పదం అవుతోంది. ఇటీవల ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్‌ను లంక బౌలర్ సేనానాయకే ఇలా అవుట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ దుమారం రేపింది.
 
 అయితే వరల్డ్ క్రికెట్ కమిటీ సభ్యుడైన ఆండ్రూ స్ట్రాస్ ఇందులో తప్పేమీ లేదన్నారు. ‘ఇది క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయం కాదు. ఇది నిబంధనలను సరిగ్గా పాటించడానికి సంబంధించినది. అలా అవుట్ కాకూడదంటే మీరు సరిగ్గా క్రీజ్‌లో ఉండండి చాలు. దీని గురించి బౌలర్ గానీ, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ గానీ హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. మన్కడింగ్ లేకపోతే నాన్‌స్ట్రైకర్ అదనపు ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తాడు’ అని స్ట్రాస్ స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు