ఇలా ఎగతాళి చేయడం బాధించింది: మెక్‌గ్రాత్‌

2 Aug, 2019 16:58 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌:  యాషస్ సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ అభిమానులు వ్యవహరించిన తీరుని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్‌ గ్లెన్ మెక్‌గ్రాత్ తప్పుబట్టాడు. ప్రధానంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ పట్ల ఇంగ్లండ్ అభిమానుల వ్యవహారించిన తీరు పట్ల మెగ్‌గ్రాత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘16 నెలలు క్రితం వారు తప్పు చేశారు. అందుకు తగిన శిక్షను కూడా అనుభవించారు. ప్రస్తుతం దానిని మరిచిపోయి ముందుకు సాగుతున్నారు. స్మిత్ సెంచరీ చేసినప్పుడు కూడా ఇంగ్లండ్ అభిమానులు ఎగతాళి చేశారు. అలా చేయడం నన్ను తీవ్రంగా బాధించింది’ అని మెక్‌గ్రాత్ అన్నాడు. ఇంగ్లండ్ అభిమానులు స్మిత్‌, వార్నర్‌లను ఎగతాళి చేస్తారని తాము ముందుగానే ఊహించామన్నాడు.(ఇక్కడ చదవండి: అండర్సన్‌ సారీ చెప్పాడు!)

ఈ మ్యాచ్‌లో వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయడానికి వెళుతున్నప్పుడు కూడా ఇంగ్లిష్‌ అభిమానులు 'చీటర్స్.. చీటర్స్' అంటూ నినాదాలు చేశారు. డేవిడ్ వార్నర్‌ ఔటై పెవిలియన్‌ వెళుతున్న సమయంలో ఇంగ్లిషు అభిమానులు సాండ్‌ పేపర్‌ చూపిస్తూ పెవిలియన్‌కు సాగనంపారు. కొందరు అభిమానులు అయితే స్టీవ్ స్మిత్ ఏడ్చిన ఫోటోలను మాస్క్‌లుగా ధరించి ఈ మ్యాచ్‌కి హాజరయ్యారు.  అయితే, ఇవేమీ పట్టించుకోకుండా స్టీవ్ స్మిత్(144) భారీ సెంచరీతో ఒంటరి పోరాటం చేసి మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. (ఇక్కడ చదవండి: అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌)

మరిన్ని వార్తలు