ఆ ఇద్దరికి భయపడేవాణ్ని: ద్రవిడ్

1 Dec, 2015 19:36 IST|Sakshi
ఆ ఇద్దరికి భయపడేవాణ్ని: ద్రవిడ్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్ గా పేరు గాంచిన రాహుల్ ద్రవిడ్ ప్రధానంగా ఇద్దరు బౌలర్లు అంటే భయపడేవాడట. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఆసీస్ మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ బౌలింగ్ అత్యంత క్లిష్టంగా ఉండేదని ద్రవిడ్ తాజాగా స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ వేసే బంతుల్ని అంచనా వేయడం చాలా కఠినంగా ఉండేదన్నాడు. తనకు ఎదురైన ఫాస్ట్ బౌలర్లలో అతనే అత్యంత ప్రమాదకారి బౌలర్ గా ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే స్పిన్ బౌలర్ల విషయానికొస్తే శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ చాలా బిగుతుగా ఉండేదన్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో అభిమానులతో ముచ్చటించిన ద్రవిడ్ తన క్రికెట్ కెరీర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు.


'మెక్ గ్రాత్ నిజంగా ఒక గొప్ప బౌలర్. నేను ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్లలో అతను అత్యంత క్లిష్టమైన బౌలర్. మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ అవతల వేసే బంతులు ఎలా వస్తున్నాయో తెలిసేది కాదు. అతను తొలి ఓవర్ మొదలుకొని ఎప్పుడూ బౌలింగ్ వేసినా ఒకేరకమైన దూకుడు ఉండేది. స్లో బౌలర్లలో మురళీ ధరన్ బౌలింగ్ ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అతను వేసే దూస్రాలను ఆడటం ఒక సవాల్. మురళీ రెండు వైపుల బంతిని బాగా స్పిన్ చేసే వాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చే అతని బంతులు అఅంచనా వేయడం నాకు కత్తిమీద సాము మాదిరిగా ఉండేది. ఎప్పుడూ నిలకడగా బౌలింగ్ చేసే మురళీని ఎదుర్కొవడానికి చాలా శ్రమించేవాడిని' అని ది వాల్ ద్రవిడ్ తెలిపాడు.

మరిన్ని వార్తలు