‘అర్జున్‌ టెండూల్కర్‌ నాకేమీ స్పెషల్‌ కాదు’

19 Jun, 2018 13:55 IST|Sakshi

న్యూఢిల్లీ:  త్వరలో శ్రీలంక పర‍్యటనకు వెళ్లే భారత అండర్‌-19 జట్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అర్జున్‌పైనే ఉంది. కాగా, అర్జున్‌ పట్ల తానేమీ ప్రత్యేక శ్రద్ధ చూపనని, జట్టులో మిగతా సభ్యుల్లాగానే అర్జున్‌ను చూస్తానని  అంటున్నాడు అండర్‌-19 భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌ సనత్‌ కుమార్‌.

‘జట్టులో అర్జున్‌ కూడా మిగతా క్రికెటర్ల మాదిరి ఆటగాడే. కోచ్‌గా నాకు జట్టులోని ఆటగాళ్లంతా ఒకటే. నా వరకు అర్జున్‌ ఏమీ స్పెషల్‌ కాదు. జట్టులోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా చూడటమే నా బాధ్యత. జట్టు ఓవరాల్‌ ప్రదర్శన ఎలా ఉందనేది దానికి ప్రాముఖ్యత. అంతేకానీ ఇక్కడ ప్రత్యేకించి ఆటగాళ్లను వేరు చేసి చూడటం ఉండదు. 2008లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టుకు కోచ్‌గా పనిచేశాను. ఇప్పుడు అండర్‌-19 భారత పురుషుల జట్టుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఈ ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్‌లో జరిగే అండర్‌-19 ఆసియా కప్‌ వరకు నేను కోచ్‌గా ఉంటాను’ అని సనత్‌ కుమార్‌ తెలిపాడు. జులై 12 నుంచి శ్రీలంకలో భారత్‌ అండర్‌-19 జట్టు పర్యటించనుంది.

మరిన్ని వార్తలు