జట్టులో లేని ఆటగాళ్లను పంపిస్తారా?

4 Jun, 2019 03:38 IST|Sakshi

భారత జట్టు మీడియా సమావేశాన్ని బహిష్కరించిన విలేకరులు

సౌతాంప్టన్‌: భారత జట్టు మేనేజ్‌మెంట్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. ప్రపంచకప్‌లో రేపు భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా... దీనికి నెట్‌ ప్రాక్టీస్‌ కోసం ఇంగ్లండ్‌ వెళ్లిన బౌలర్లు దీపక్‌ చహర్, అవేశ్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌లు వచ్చారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు... టీమిండియా కెప్టెన్‌ కోహ్లి కాకపోయినా, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రినో లేదంటే కనీసం సీనియర్‌ క్రికెటర్‌ ఎవరైనా వస్తారని ఆశించారు.

తీరా జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్‌లో కనబడటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విలేకరులు... సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను సంప్రదించగా... భారత్‌ ప్రపంచకప్‌ ఆట ఇంకా మొదలుకాకపోవడం వల్లే నెట్‌ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని బదులిచ్చాడు. గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటి కెప్టెన్‌ ధోని మీడియా సమావేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  

బుమ్రాకు డోప్‌ టెస్టు: భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సోమవారం డోప్‌ టెస్టు నిర్వహించారు. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) గుర్తింపు ఉన్న ఏజెన్సీ బుమ్రా నుంచి మూత్ర నమూనాలను సేకరించింది. ఇది ప్రపంచకప్‌ టోర్నీ కావడంతో పలానా జట్టుకు అని కాకుండా ర్యాండమ్‌గా ఎవరికైనా డోపింగ్‌ పరీక్షలు నిర్వహించే అవకాశముంటుంది. 

>
మరిన్ని వార్తలు