మణిపూర్‌ క్రీడల్లో ‘ట్రాన్స్‌జెండర్స్‌’

17 Jun, 2020 14:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్‌ వాసులు ‘యేవ్‌శాంగ్‌’ పండుగను అంగరంగ వైభవంగా జరపుకుంటారు. వసంతం రాకకు సూచికగా జరపుకునే ఈ పండుగను ‘మణిపూర్‌ హోలీ’ పండుగగా కూడా అభివర్ణిస్తారు. ఐదు రోజులపాటు కొనసాగే ఈ పండుగ సందర్భంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, పిల్లా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఈ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ రకాల క్రీడలు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. ముగింపు సందర్భంగా సంగీత విభావరీలు కూడా ఉంటాయి.

ఈసారి క్రీడల్లో త్రిలింగీయులు (ట్రాన్స్‌జెండర్స్‌) ప్రధాన ఆకర్షణ కానున్నారు. మణిపూర్‌ వాసుల్లో అత్యధిక ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌ పొటీల్లో వారు పాల్గొననున్నారు. యువజన, త్రిలింగీయుల సాధికారికతకు కృషి చేస్తోన్న ‘యా ఆల్‌’ ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకులు, పీహెచ్‌డీ విద్యార్థి సదమ్‌ హంజాబమ్‌ ప్రోత్సాహంతో 14 మంది సభ్యులు గల త్రిలింగీయులు ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనున్నారు. వారు ఆరుగురు జట్టు చొప్పున రెండు జట్లుగా విడిపోయి పరస్పరం పోటీ పడనున్నారు. (హిజ్రా అని అంద‌రూ న‌వ్వుతున్నారు..)

అటు స్త్రీలతోని, ఇటు పురుషుల జట్లతో పోటీ పడేందుకు త్రిలింగీయులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా అందుకు సమాజం ఆమోదం రావడం లేదని, అప్పటి వరకు వారిలో వారు పోటీ పడడమే భావ్యమని భావించినట్లు వారితో జాతీయ జట్టును కూడా రూపొందించిన సదమ్‌ తెలిపారు. ఆయన త్రిలింగీయులతో 2018, 2019 సంవత్సరాల్లో వరుసగా ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లు నిర్వహించారు. గత మార్చి నెలలో ఇంఫాల్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌కు కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

త్రిలింగీయులను రెండుగా విభజించి, అంటే పురుషులుగా మారిన వారిని ఓ జట్టుగా, స్త్రీలుగా మారిన వారిని ఓ జట్టుగా చేసి ఆయన పోటీలు నిర్వహించినప్పుడు ప్రజలు ఎగబడి చూశారు. అదే వారికి పురుషుతో, స్త్రీలతో పోటీలు నిర్వహిస్తే ఇప్పుడే సరైన ఆదరణ లభించక పోవచ్చని సదమ్‌ అన్నారు. ఏ నాటికైనా స్త్రీ, పురుషులతో సమానంగా త్రిలింగీయులను గుర్తిస్తారని, జాతీయ స్థాయి క్రీడల్లో వారికి కూడా సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్తారు. (జవాన్ల మరణంపై ట్వీట్‌: డాక్టర్‌ సస్పెన్షన్‌‌)

మరిన్ని వార్తలు